వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు రాజ్యసభను తాకాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే రైతు ఉద్యమం, సాగు చట్టాలపై చర్చించాలంటూ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. రైతుల ఆందోళనలపై చర్చ బుధవారం ఉంటుందని.. ఇవాళ కాదని వెంకయ్య బదులిచ్చారు. మంగళవారం సాయంత్రం ఈ వ్యవహారంపై లోక్సభ చర్చిస్తుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ఇందుకు విపక్ష నేతలు అంగీకరించలేదు. రైతుల ఉద్యమంపై చర్చకు పట్టుబట్టారు. వీరి గందరగోళం నడుమే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు కొనసాగించారు వెంకయ్య. నిరసనగా పలువురు విపక్ష నేతలు వాకౌట్ చేయగా.. మరికొందరు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు.
విపక్షాల ఆందోళనతో సభను 10:30 వరకు వాయిదా వేశారు వెంకయ్య. అనంతరం సభ ప్రారంభమైనా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. దీంతో మళ్లీ 11:30 వరకు వాయిదా వేశారు. అనంతరం సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో మార్పులేదు. ఫలితంగా సభ మూడోసారి 12:30 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సాగు చట్టాలపై చర్చ తక్షణమే జరపాలని సభ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో సభను బుధవారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రకటించారు.
సభా గౌరవాన్ని కాపాడాలి..