"ప్రస్తుతం దేశానికి ఒక మంచి రాష్ట్రపతి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని, దేశ పౌరులను అధికార పార్టీ నుంచి రక్షించే నాయకుడు కావాలి. నేను కరోనాతో బాధపడుతున్నందున ఇతర నాయకులతో సమన్వయం కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను నియమిస్తున్నా."
-ప్రతిపక్షాలకు రాసిన లేఖలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
"అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రతిష్ఠ మసకబారింది. ఇలాంటి పరిస్థితిలో ప్రతిపక్షాలు ఏకం కావాలి. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై మనల్ని పీడిస్తున్న విభజన శక్తులను ప్రతిఘటించాలి. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జూన్ 15 న దిల్లీలో నిర్వహించే సమావేశానికి మీరు హాజరుకావాలి."
-భాజపాయేతర పార్టీలకు రాసిన లేఖలో బంగాల్ సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee Letter: రాష్ట్రపతి ఎన్నికల వేళ.. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. వేర్వేరుగా శనివారం రాసిన లేఖల సారాంశాలు ఇవి. అయితే ఇందులో బంగాల్ సీఎం రాసిన లేఖ.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో బలంగా కనిపిస్తున్న భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలు కలిసి ముందుకెళ్తాయని అనుకుంటున్న తరుణంలో.. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా.. దీదీ లేఖ రాయడం.. ప్రతిపక్షాల ఐకమత్యానికి అవరోధంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా ప్రతిపక్షాల ఐక్యత ప్రమాదంలో పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దుర్భేద్యమైన భాజపాను ఢీకొట్టేందుకు.. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది కాంగ్రెస్. ఇందుకోసం తగిన కార్యాచరణ ప్రణాళిక సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రతిపక్షాలకు స్వయంగా సోనియా గాంధీనే లేఖ రాశారు. చర్చల బాధ్యతలను మల్లికార్జున ఖర్గేను అప్పగించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే.. మమతా బెనర్టీ సైతం అనూహ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా 22మంది విపక్ష నేతలకు లేఖలు రాశారు. జూన్ 15న దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని ఆ లేఖలో కోరారు. మమతా బెనర్జీ రాసిన ఈ లేఖ.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Congress on Mamata Banerjee Letter: మమత లేఖపై కాంగ్రెస్ పెదవి విరిచింది. ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు.
"రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష శక్తులకు నాయకత్వం వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మమతా బెనర్జీ నిర్వహించే సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మమత మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపలేదు. ప్రతిపక్షం నుంచి ఒక్కరే అభ్యర్థి ఉండాలని మేం అనుకుంటున్నాం. అయితే అది ఏకాభిప్రాయంతో ఉంటే బాగుంటుంది. "
- ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
లెఫ్ట్ ఫ్రంట్ మండిపాటు
మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంపై లెఫ్ట్ ఫ్రంట్ తీవ్రంగా మండిపడింది. సీపీఎం సీనియర్ నేత సుజన్ చక్రవర్తి.. 'ఈటీవీ భారత్'తో మమత లేఖపై మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా రోజుల ముందు నుంచే ఉమ్మడి అభ్యర్థి విషయంపై చర్చలు జరుపుతున్నారన్నారు సుజన్ చక్రవర్తి. ఆ బాధ్యతలను మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారన్నారు.