సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. మంత్రులు ఏకభాషణ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తాయి. వంతెనలు నిర్మించాల్సిన సమయంలో.. రైతులు ఆందోళన ప్రాంతాల్లో రహదారులపై గుంతలు తవ్వడం, మేకులు కొట్టడం వంటివి చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో రెండో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా.. విమర్శలను కేంద్రం దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు.
"చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. రైతుల బాధలను అర్థం చేసుకోండి. కఠినమైన శీతాకాలంలో మీరు నీటి సరఫరాను నిలిపివేశారు. రోడ్లపై కందకాలు తవ్వారు. ముళ్ల తీగలు, మేకులను రహదారికి అడ్డంగా అమర్చారు. నేను దేశ సరిహద్దులోకి వెళ్లాను. ఇలాంటి దూకుడైన విధానాలు భారత్‌లోకి వచ్చిన పొరుగుదేశాల పట్ల చూపించడం లేదు."
-మనోజ్ కుమార్ ఝా, ఆర్జేడీ ఎంపీ
పాప్‌స్టార్ రిహానా చేసిన ట్వీట్‌పై స్పందించిన ఝా.. ఒక్క ట్వీట్ వల్ల ప్రజాస్వామ్యం బలహీనంగా మారిపోదని అన్నారు. భాజపా గత ఎన్నికల్లో 303 స్థానాలు గెలవడానికి కారణం రైతులేనని, కోల్డ్ స్టోరేజీల వ్యవస్థను నియంత్రించే వారివల్ల కాదని పరోక్షంగా కార్పొరేట్ వర్గాలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.
రైతులను ఖలిస్థానీ, నక్సల్స్, పాకిస్థాన్ ఏజెంట్లుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మనోజ్ కుమార్ ఝా. విమర్శలను వినే ఓపిక ప్రభుత్వానికి నశించిందని, మరుగుదొడ్ల సదుపాయాలను తొలగించారని అన్నారు. కనీస మద్దతు ధరకు 2006లోనే బిహార్ చరమగీతం పాడిందని, ఇప్పుడు రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులే తప్ప రైతులు లేరని చెప్పారు. ఇప్పుడు కూలీలను సరఫరా చేసే స్థితికి చేరిందని, పంజాబ్, హరియాణాను సైతం ఇదే విధంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అది నియంతృత్వమే: కాంగ్రెస్
అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. పెద్ద నోట్ల రద్దు నుంచి.. సీఏఏ వరకు ప్రతి నిర్ణయం ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ అని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులుగా మారారని చెప్పుకొచ్చారు.
సాగు చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా అభివర్ణించిన ఆయన.. భారతీయ కిసాన్ సంఘ్ సైతం పలు నిబంధనలను వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను విప్లవంగా పరిగణిస్తే.. అది నియంతృత్వమే అవుతుందన్నారు.