ప్రధాని పర్యటనకు ముందు మోర్బీ ప్రమాదంలో గాయపడ్డ వారు ఉన్న ఆస్పత్రికి రంగులు వేయడం రాజకీయంగా వివాదాస్పదమైంది. క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో అసలు ఇన్ని హంగులు ఎందుకు అని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు. ఈ మేరకు ఆస్పత్రికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ శుక్లా ట్విట్టర్లో షేర్ చేశారు. "ఏదైనా విషాదం జరిగిన ఇంటికి మనం పెయింట్ వేస్తామా? ఆసుపత్రి ఆవరణలో కనీసం 134 శవాలు పడి ఉన్నాయి. అలాంటి ఆస్పత్రికి హంగులు అద్దుతున్నారు" అని సౌరభ్ పోస్ట్ చేశారు.
ఎమ్మెల్యే అప్‌లోడ్ చేసిన చిత్రాలను దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రీట్వీట్ చేశారు. "గత 27 ఏళ్లుగా గుజరాత్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. మరి ఇంతటి విషాద సమయంలో ఆసుపత్రికి ఇలా రంగులు వేయించడం సిగ్గుచేటు" అని వ్యాఖ్యానించారు.
ఆస్పత్రి వద్ద పనులు జరుగుతున్నప్పుడు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వేళ వాటిని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అసలు ఇదంతా మోదీ ఫొటో షూట్ కోసం జరుగుతున్న ఆర్భాటం అని మండిపడ్డారు.
వంతెన ఘటనపై సుప్రీం కోర్టులో పిల్
మరోవైపు.. గుజరాత్ మోర్బీ వంతెన ఘటనపై దర్యాప్తునకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని నవంబర్ 14న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. వంతెన ప్రమాదం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమని.. ఈ పిల్‌ను వీలైనంత త్వరగా కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆశించానని పిటిషనర్ విశాల్ తివారీ వ్యాఖ్యానించారు.