ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంట్లో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. అదానీ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసేందుకు బీజేపీ భయపడుతోందని విమర్శించారు. అదానీ వివాదంలో జేపీసీ కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సీపీఐ, సీపీఐ(ఐమ్), శివసేన(ఉద్దవ్ ఠాక్రే), జేజీ(యూ), ఆప్ పార్టీల నాయకులు విజయ్ చౌక్ వైపు ర్యాలీగా వెళ్లారు. 'సేవ్ ఎల్ఐసీ', 'వీ డిమాండ్ జేపీసీ' అని రాసున్న ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. 'ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది' అని రాసిన పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఖర్గే.. రాహుల్ కేసులో ఇటీవల సూరత్ కోర్టును ఇచ్చిన తీర్పు అంశాన్ని లేవనెత్తారు. ప్రతిపక్షాల గొంతులను నొక్కడానికే ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు.. కేసులతో ప్రతిపక్షాలను లేకుండా చేయడానికే అని అర్థమవవుతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. అయితే, అంతకుముందు విజయ్ చౌక్ వద్ద ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆదేశాలు పాటించనందుకు.. ప్రముఖ నాయకులు కేసీ వెణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరీ, కె సురేశ్, మాణికం ఠాగూర్, మహ్మద్ జావెద్‌ను పోలీసులు అడ్డుకుని నిర్బంధించారని ప్రతిపక్షాలు తెలిపాయి.