తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెగాసస్ రగడ- పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా - parliament session monsoon 2021

విపక్షాల ఆందోళనలతో సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. వాయిదాకు ముందు కార్గిల్ యుద్ధవీరులకు పార్లమెంట్ సభ్యులు నివాళులు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానును అభినందించారు.

PARLIAMENT MONSOON SESSION
పెగాసస్ రచ్చ- పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

By

Published : Jul 26, 2021, 12:00 PM IST

పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్​ సహా పలు అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబడటం వల్ల ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.

వెంకయ్య అసహనం

కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు సహా ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుకు అభినందనలు తెలిపిన అనంతరం.. రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు వెల్​లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రాముఖ్యత ఉన్న అంశాలను ప్రస్తావించకుండా విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 'రోజురోజుకూ నిస్సహాయంగా తయారవుతున్నాం' అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కార్గిల్ అమరవీరులకు రాజ్యసభ నివాళి

మరోవైపు, లోక్​సభలోనూ పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.

కార్గిల్ వీరులకు నివాళి

వాయిదాకు ముందు ఉభయ సభలు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించాయి. దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా కొద్ది క్షణాల పాటు మౌనం పాటించాయి.

కార్గిల్ యుద్ధవీరులకు నివాళిగా మౌనం పాటిస్తున్న లోక్​సభ సభ్యులు

మీరాబాయికి అభినందన

అదేసమయంలో ఒలింపిక్స్​లో రజత పతకం సాధించిన వెయిట్​లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు కృతజ్ఞతలు తెలిపాయి. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్​లిఫ్టింగ్​లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.

ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా పార్లమెంట్​కు ట్రాక్టర్​పై వెళ్లిన రాహుల్

ABOUT THE AUTHOR

...view details