No Confidence Motion Voting Results : ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. మూజువాణి ఓటింగ్ నిర్వహించిన స్పీకర్.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరిగింది. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్ సహా విపక్షాలను ఎండగట్టారు. "2018 తర్వాత 2023లో అవిశ్వాసం పెట్టారు. కనీసం పెట్టేదైనా సరిగ్గా పెట్టొచ్చు కదా. అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారనే దానికి స్పష్టత లేదు.. సంసిద్ధత లేదు. మరోసారి అవిశ్వాసం పెట్టినప్పుడైనా సంపూర్ణ సంసిద్ధతతో వస్తారని ఆశిస్తున్నా" అని మోదీ అన్నారు.
Opposition No Confidence Motion In Parliament: సభ ప్రజల సొమ్ముతో నడుస్తోందని, ప్రతిక్షణం అత్యంత విలువైనదని మోదీ అన్నారు. ప్రజల ధనాన్ని, సభా సమయాన్ని దుర్వినియోగం చేయకూడదని విపక్షాలకు హితవుపలికారు. రాజకీయాలు బయట చేయాలి తప్ప.. సభలో కాదని సూచించారు. దేశాభివృద్ధి, సమగ్రత కోసం ఫలవంతమైన చర్చలు జరగాలని, అందుకు విపక్షాలు సహకరించాలని మోదీ కోరారు. మరోవైపు లోక్‌సభలో ప్రధాని ప్రసంగం సమయంలోనే విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ నుంచి బయటకి వెళ్లిపోయారు.
ఇది రెండోసారి...
No Confidence Motion Before : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2018, జులై 20న విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అప్పుడా తీర్మానాన్ని 325 ది సభ్యులు వ్యతిరేకించగా, కేవలం 126మంది ఎంపీలే బలపరచారు. ఆ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ- 2023లోనూ తమ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి అదే నాంది అవుతుందంటూ జోస్యం చెప్పారు. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది.