Opposition No Confidence Motion India : పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఉండేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనవత్రం పట్టారని.. ఆయన్ను మాట్లాడించేందుకే తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (congress no confidence motion )పై మంగళవారం చర్చ ప్రారంభమైంది. చర్చలో అందరికన్నా ముందుగా మాట్లాడిన గొగొయ్.. 'మేం అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చే పరిస్థితులు తలెత్తాయి. ఇది లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం గురించి తెలుసుకోవడానికి తీసుకువచ్చింది కాదు. మేం ఈ తీర్మానం నెగ్గుతామన్న నమ్మకం కూడా లేదు. కానీ, మణిపుర్‌కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకువచ్చాం' అని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధానికి మూడు ప్రశ్నలను సంధించారు. అవి..
- ఇప్పటివరకు ప్రధాని మోదీ మణిపుర్‌లో ఎందుకు పర్యటించలేదు?
- మణిపుర్‌పై మాట్లాడేందుకు మోదీకి 80 రోజుల సమయం ఎందుకు పట్టింది..? అప్పుడు కూడా కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడతారా..?
- ఎందుకు ఇప్పటివరకు మణిపుర్ సీఎంను తొలగించలేదు..?
"ఈ దు:ఖ సమయంలో మణిపుర్‌కు ఓ సందేశం వెళ్తుంది. ఈ సభ మొత్తం మణిపుర్ వెంట ఉంది. శాంతి కోరుకుంటోంది. ఇది మా కోరిక. కానీ అలా జరగలేదు. ప్రధానమంత్రి మోదీ మౌనవ్రతం చేపట్టారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలనుకున్నాం. మణిపుర్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు విఫలమైంది. మణిపుర్ వైరల్ వీడియో ఎంత దారుణంగా ఉందో దేశమంతా చూసింది. మణిపుర్ అత్యాచార బాధిత మహిళ భర్త ఒక కార్గిల్ సైనికుడు. దేశాన్ని రక్షించిన తాను.. కుటుంబాన్ని కాపాడుకోలేకపోయానని సైనికుడు కన్నీటిపర్యంతమయ్యారు. మణిపుర్ వీడియోలు బయటకు రాకుంటే మోదీ పెదవి విప్పేవారే కాదు. మణిపుర్‌లో ఇంత జరుగుతుంటే భద్రతాదళాలు ఏం చేస్తున్నాయి?. ఈ అంశంలో కేంద్రం, రాష్ట్రం వైఖరిని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది."
--గౌరవ్ గొగొయ్, కాంగ్రెస్ ఎంపీ
Bjp No Confidence Motion : కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అనంతరం బీజేపీ తరఫున అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిచారు ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే. ఇది అవిశ్వాసం కాదని.. విపక్షాల విశ్వాస తీర్మానం అని విమర్శించారు. ఈ సభలో ఉన్న చాలామందికి మణిపుర్ గురించి తెలియదని.. ఈ అంశంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేనేలేదన్నారు. ఇండియా కూటమిలో చాలామందికి దాని అర్థమే తెలియదని ఎద్దేవా చేశారు.