Opposition Meeting Today :ఇండియా కూటమి ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యవహరించనున్నారు. తీవ్ర సంప్రదింపుల తర్వాత కూటమి ఛైర్‌పర్సన్‌గా ఖర్గే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కూటమి కన్వీనర్ పదవి స్వీకరించాలని తొలుత జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌ను కాంగ్రెస్ కోరగా, అందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఖర్గేకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల వ్యూహరచనే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వర్చువల్‌గా శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో నీతీశ్‌ను కూటమి కన్వీనర్ పదవిని చేపట్టమని కాంగ్రెస్ ప్రతిపాదించగా, అందుకు ఆయన తిరస్కరించారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన నేతలెవరైనా కన్వీనర్ పదవి స్వీకరించాలని నీతీశ్ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఖర్గే వైపు మొగ్గు చూపాయి కూటమి పార్టీలు.
వర్చువల్‌గా ఇండియా భేటీలో పాల్గొన్న శరద్ పవార్ 'నిర్మాణాత్మకంగా చర్చలు'
సీట్ల సర్దుబాటు అంశంపై సమావేశంలో అందరూ సంతృప్తికరంగానే ఉన్నారని, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. నిర్మాణాత్మకంగా, సానుకూలంగా చర్చలు జరిగాయని చెప్పారు. త్వరలో నిర్వహించబోయే కార్యక్రమాల గురించి కూడా చర్చించినట్లు చెప్పారు. దేశ ప్రజల సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఇండియా పార్టీలను రాహుల్ గాంధీ ఆహ్వానించారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వర్చువల్‌గా ఇండియా భేటీలో పాల్గొన్న స్టాలిన్, కనిమొళి సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలు, కూటమి కన్వీనర్ ఎంపిక, రాహుల్‌గాంధీ ప్రారంభించబోయే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రతిపక్ష కూటమి నేతల హాజరు అంశాలే అజెండాగా ఈ వర్చువల్ సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన సోదరి కనిమొళిసహా ఇతరనేతలు హాజరయ్యారు. అంతకుముందు, ఈ వర్చువల్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హజరు కావట్లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముందస్తుగా నిర్ణయించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటం వల్ల భేటీలో ఆమె పాల్గొనడం లేదని తెలిపాయి.
ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోంది. ఈ చర్చలు తుదిదశకు చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆప్‌తో సీట్ల సర్దుబాటు చర్చలు సానుకూలంగా జరుగుతుండగా, టీఎంసీతో పీఠముడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి రెండుస్థానాలు మాత్రమే ఇస్తామని టీఎంసీ తేల్చి చెప్పింది. అందుకు ఒప్పుకుంటేనే ఆ పార్టీకి చెందిన కమిటీతో చర్చలకు సిద్ధమని లేకుంటే లేదని స్పష్టం చేసింది.