Opposition Meeting Mumbai : కేంద్రంలోని అధికార బీజేపీపై ఉమ్మడి పోరుకు చేతులు కలిపిన విపక్షాల కూటమి మూడో సమావేశానికి ముహుర్తం ఖారారైంది. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబయిలోని గ్రాండ్ హయాత్ హోటల్లో ఈ సమావేశం జరగనున్నట్లు శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ముంబయిలో జరిగిన మహా వికాస్ అఘాడీ మీటింగ్ అనంతరం మాట్లాడిన రౌత్.. ఈ సమావేశానికి శివసేన ఉద్ధవ్ వర్గం నేతృత్వం వహిస్తోందని స్పష్టం చేశారు. తమతో కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కూడా ఉంటాయని తెలిపారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో సహా విపక్ష నేతలకు ఆగస్టు 31న ఏర్పాటు చేసే విందుకు ఉద్ధవ్ ఠాక్రే ఆతిథ్యం ఇస్తారని సంజయ్ రౌత్ తెలిపారు.
"ఈరోజు సమావేశమైన MVA నాయకులు పట్నా, బెంగుళూరులో జరిగిన విధంగా 'ఇండియా' సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల సమావేశానికి ఏర్పాట్లు చేయడానికి మేము ప్రతి నాయకుడికి బాధ్యతలు అప్పగించాం"
-- సంజయ్ రౌత్, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత
మహా వికాస్ అఘాడీ ముఖ్య నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎస్సీపీ (శరద్) అధినేత శరత్ పవార్, ఆ పార్టీ రాష్ట యూనిట్ చీఫ్ జయంత్ పాటిల్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, శివసేన (ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సుభాశ్ దేశాయ్, కాంగ్రెస్ నేతలు పృథ్విరాజ్ చవాన్, అశోక్ చవాన్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వాడెట్టివార్, కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చీఫ్ నానా పటోలే హాజరయ్యారు.