తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2024లో ఐక్యపోరాటం.. ఉమ్మడి అజెండాతో ఎన్నికల్లో పోటీ.. జులైలో మరో భేటీ' - ప్రతిపక్షాల ఐక్యతపై ఉమ్మడి మీటింగ్

Opposition Meeting In Patna
Opposition Meeting In Patna

By

Published : Jun 23, 2023, 12:08 PM IST

Updated : Jun 23, 2023, 4:41 PM IST

16:36 June 23

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 17 విపక్ష పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. పట్నాలో బీజేపీయేతర పార్టీల సమావేశం అనంతరం బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్ ఈమేరకు వెల్లడించారు. శుక్రవారం జరిగిన భేటీ సానుకూల వాతావరణంలో జరిగిందని చెప్పారు. జులై 10 లేదా 12న శిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మరోసారి విపక్షాలు సమావేశం అవుతాయని వెల్లడించారు నీతీశ్. ఐక్యపోరాటం సాగించేందుకు ఉమ్మడి అజెండాను అదే భేటీలో ఖరారు చేస్తామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని.. తాము మాత్రం జాతి ప్రయోజనాల కోసమే ఏకమయ్యామని చెప్పారు నీతీశ్.

16:07 June 23

విపక్షాల మీటింగ్ పూర్తి

2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీని గద్దెదింపడమే లక్ష్యంగా బిహార్​లోని పట్నాలో జరిగిన కీలక విపక్ష నేతల సమావేశం ముగిసింది. బిహార్ CM నీతీశ్ కుమార్ నివాసంలో 15 పార్టీల విపక్ష నేతలు సమావేశమయ్యారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ప్రతిపక్షాల చర్చించాయి.

14:32 June 23

ప్రతిపక్షాల మీటింగ్​పై బీజేపీ చురకలు

విపక్షాల సమావేశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది బీజేపీ. ప్రతిపక్ష నేతల సమావేశాన్ని ఫొటో షూట్ సెషన్​గా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రతిపక్షాలు ఎప్పుటికీ ఏకం కాలేవని.. 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోనే 300కు పైగా స్థానాలను గెలుస్తామన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కాలంలో జైలు పాలైన నేతలందరూ ఇప్పడు.. ఆమె మనవడు రాహుల్ గాంధీకి స్వాగతం తెలుపుతున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వంశపారపర్య పార్టీలన్నీ .. తమ కుటుంబాలను కాపాడుకోవడానికి సమావేశం అయ్యాయని ఆరోపించారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. 2019లో కూడా ఇలాంటి సమావేశాలే జరిగాయని.. కానీ అవేవీ ఫలించలేదని ఎద్దేవా చేశారు.

13:08 June 23

రాహుల్ గాంధీ రియల్ దేవదాస్​.. బీజేపీ పోస్టర్​

రాహుల్​ గాంధీపై బీజేపీ పోస్టర్​

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీని దేవదాస్​తో పోల్చుతూ పోస్టర్లు పెట్టింది బీజేపీ. షారుఖ్ ఖాన్​ రీల్​ దేవదాస్​ అయితే.. రాహుల్ గాంధీ రియల్ దేవదాస్ అంటూ వ్యంగస్త్రాలు సంధించింది. "మమతా.. బంగాల్​ను వదలమన్నారు. లాలూ-నీతీశ్​.. బిహార్​ను, స్టాలిన్​.. తమిళనాడును, అఖిలేశ్.. ఉత్తర్​ ప్రదేశ్​ను వదలమన్నారు. చివరకు రాహుల్​ను రాజకీయాలు కూడా వదులుకోమంటారు. ఆరోజు కూడా దగ్గర్లోని ఉంది" అని పోస్టర్​లో ఉంది.

12:42 June 23

పెళ్లి కొడుకు ఎవరు?.. నీతీశ్​పై బీజేపీ సెటైర్​

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా.. పట్నాలో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. 2024 ఎన్నికలకు నీతీశ్​ కుమార్ ఊరేగింపును సిద్ధం చేస్తున్నారని.. కానీ పెళ్లికుమారుడు ఎవరనే విషయాన్ని ఇంకా చెప్పలేదని సెటైర్​ వేశారు. మరోవైపు ప్రతిపక్షాలు గాలిలో కోటలు కడుతున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఎద్దేవా చేశారు. ఎవరేం చేసినా నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీకి దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గత రికార్డులను బద్దలు కొట్టి.. భారీ మెజారిటీతో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చౌహాన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

12:16 June 23

విపక్షాల మీటింగ్ ప్రారంభం

నీతీశ్​ ఇంట్లో విపక్షాల మీటింగ్

Opposition Meeting In Patna : వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా.. విపక్ష నేతల సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం బిహార్‌ రాజధాని పట్నాలో ప్రతిపక్ష నేతల భేటీ జరుగుతోంది. బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ చొరవతో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), తమిళనాడు సీఎం స్టాలిన్‌ (డీఎంకే), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (ఆప్‌), ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం) సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన-యూబీటీ), సీపీఎం, సీపీఐ, పీడీపీకి చెందిన నేతలు హాజరయ్యారు. 80 లోక్​సభ సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఒక్క సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశమైంది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి ఆహ్వానం పంపలేదు. కుటుంబ కార్యక్రమాల కారణంగా సమావేశానికి తాను హాజరుకావడం లేదని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత జయంత్‌ చౌధరి తెలిపారు.

09:48 June 23

విపక్షాల మీటింగ్

Opposition Meeting In Patna : 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టాలనే లక్ష్యంతో ఏర్పాటైన సమావేశం బిహార్​ రాజధాని పట్నాలో కాసేపట్లో ప్రారంభం కానుంది. అంతకుముందు కాంగ్రెస్​ కార్యకర్తలతో సమావేశం అయ్యారు అగ్రనేత రాహుల్​ గాంధీ. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీని ఓడిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ.. దేశాన్ని విభజించి.. విద్వేషం, హింసతో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించారు. రెండు సిద్ధాంతాల మధ్య వైరుధ్యమని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతం.. భారత్​ జోడో అయితే, బీజేపీది భారత్ తోడో అని దుయ్యబట్టారు. విద్వేషాన్ని.. విద్వేషంతో ఓడించలేమని.. ప్రేమతోనే సాధ్యమని చెప్పారు. తెలంగాణ, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందన్నారు. కర్ణాటకలో బీజేపీ నేతలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కాంగ్రెస్సే గెలిచిందన్న గాంధీ.. విపక్షాలతో కలిసి రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిహార్​లో కాంగ్రెస్ గెలిస్తే.. దేశమంతా గెలుస్తామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలు విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. బిహార్​.. తమ సిద్ధాంతాన్ని ఎప్పడూ వదిలిపెట్టలేదని చెప్పారు. విపక్షాల మీటింగ్​కు వచ్చిన ఖర్గే.. పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

Last Updated : Jun 23, 2023, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details