తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Opposition Meeting : ''ఇండియా' కూటమి 'బలం'.. మోదీ సర్కార్​కు భయం భయం!' - ఇండియా కూటమి చంద్రయాన్​ 3పై తీర్మానం

Opposition Meeting In Mumbai : 2024 ఎన్నికల్లో ఎన్​డీఏను ఢీకొట్టేందుకు కసరత్తు చేస్తున్న విపక్ష పార్టీల బలం.. బీజేపీ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోందని కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి ఎంత పుంజుకుంటే బీజేపీ ప్రభుత్వం అంతలా ప్రతిపక్ష నాయకులపై దాడులకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని జోస్యం చెప్పారు.

Opposition Meeting In Mumbai
Opposition Meeting In Mumbai

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 2:01 PM IST

Updated : Sep 1, 2023, 2:17 PM IST

Opposition Meeting In Mumbai : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి విపక్షాల 'ఇండియా' కూటమి బలం... ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని.. ప్రతిపక్ష కూటమి నేతలు ప్రతీకార రాజకీయాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముంబయిలో జరుగుతున్న విపక్షాల మూడోసమావేశంలో ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

Opposition Meeting Kharge : గత తొమ్మిదేళ్లలో బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ వ్యాప్తి చేసిన మతపరమైన విషం.. ఇప్పుడు రైలు ప్రయాణికులు, స్కూల్​ విద్యార్థులపై జరుగుతున్న దారుణాల్లో కనిపిస్తోందని ఖర్గే ఆరోపణలు చేశారు. ఇటీవలే హోమ్​వర్క్​ పూర్తి చేయనందుకు గాను ముస్లిం చిన్నారికి చెప్పుతో కొట్టమని మిగతా విద్యార్థులకు టీచర్​ చెప్పిన ఘటనను ఖర్గే పరోక్షంగా ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ పగ రాజకీయాల కారణంగా రానున్న నెలల్లో మరిన్ని దాడులు, అరెస్టులకు ప్రతిపక్ష నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. విపక్ష కూటమి ఎంత పుంజుకుంటే బీజేపీ ప్రభుత్వం అంతలా ఇండియా కూటమి నాయకులపై దాడులకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

ఇస్రోకు ఇండియా కూటమి అభినందనలు..
అంతకుముందు.. ముంబయిలోని గ్రాండ్‌హయత్‌లో విపక్షాల కూటమి శుక్రవారం ఉదయం భేటీ అయింది. చంద్రయాన్-3 మిషన్​ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను అభినందిస్తూ విపక్ష కూటమి తీర్మానం ఆమోదించింది. అందులో ఇస్రో సామర్థ్యాలను విస్తరించడానికి ఆరు దశాబ్దాలు పట్టిందని పేర్కొంది. ఇలాంటి అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయని.. యువత సైన్స్​లో రాణించడానికి స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆదిత్య-ఎల్​1 మిషన్​ ప్రయోగానికి ప్రపంచమంతా ఆసక్తిగా వేచి చూస్తోందని చెప్పింది.

బీజేపీ కౌంట్​డౌన్​ స్టార్ట్​!
కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్​డౌన్​ ప్రారంభమైందని ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు సమావేశమైన ఇండియా కూటమి నేతల గ్రూప్ ఫొటోను ఖర్గే ఎక్స్​లో పోస్ట్​ చేశారు. "జుడేగా భారత్, జీతేగా ఇండియా. ప్రగతిశీల, సంక్షేమ ఆధారిత, సమ్మిళిత భారతదేశం కోసం మేము ఐక్యంగా ఉన్నాం. 140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వ నిష్క్రమణ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది!" అని రాసుకొచ్చారు.

'దేశానికి కావాల్సింది న్యాయమైన ఎన్నికలు..'
దేశానికి కావల్సింది న్యాయమైన ఎన్నికలని.. 'ఒక దేశం ఒక ఎన్నికలు' కాదని శివసేన-UBT నేత సంజయ్ రౌత్ తెలిపారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్న ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకు 'ఒక దేశం ఒకే ఎన్నికలు' విధానంపై కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిందని విమర్శించారు. రామ్​నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపించారు. ఇప్పుడు 'ఒక దేశం ఒక ఎన్నికలు'పై కమిటీతో ఆయనను బిజీగా మార్చనుందని తెలిపారు. గణేశ్​ నవరాత్రుల సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇలా చేస్తుందని ఆరోపించారు. అన్ని మిత్రపక్షాలను కలుపుకుని వివిధ అంశాలపై ఏకాభిప్రాయం సాధించే లక్ష్యంతో విపక్ష కూటమి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైవు, ఇండియా కూటమి లోగో ఆవిష్కరణ వాయిదా పడిందని కాంగ్రెస్​ నేత విజయ్​ వద్దేటివార్​ వెల్లడించారు. వివిధ సమన్వయ కమిటీల ఏర్పాటుపై చర్చ జరుగుతుందని చెప్పారు.

Last Updated : Sep 1, 2023, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details