Opposition Meeting In Delhi :కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఇండియా కూటమిలోని 17 పార్టీలకు చెందిన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం సాయంత్రం ప్రతిపక్ష నేతలు చర్చించారు.
ఖర్గే ఇంట్లో సమావేశం
పార్లమెంట్ ఉభయసభల్లోని విపక్షాల ఫ్లోర్ లీడర్లు ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. భావసారూప్యత గల పార్టీలు దిల్లీలోని రాజాజీ మార్గ్‌లోని తన ఇంట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారని ట్వీట్ చేశారు. పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలపై చర్చించుకున్నామని పోస్ట్‌లో పేర్కొన్నారు. విపక్ష పార్టీలన్నింటితో సంప్రదింపులు జరిపిన తర్వాత తదుపరి సమావేశానికి తేదీని ఖరారు చేస్తానని అన్నారు.
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
విపక్షాల రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్నారని కాంగ్రెస్ ఎంపీ నసీర్ హుస్సేన్ తెలిపారు. 'పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుకున్నాం. మరికొద్ది రోజుల్లో ఇండియా కూటమి సమావేశం జరుగబోతుంది. ఒకట్రెండు రోజుల్లో సమావేశం తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు. మరోవైపు, విపక్ష కూటమిలో ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని RSP ఎంపీ ప్రేమచంద్రన్ స్పష్టం చేశారు. రాజ్యసభ, లోక్‌సభ ఫ్లోర్ లీడర్లు ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారని త్వరలో విపక్ష కూటమి కార్యకలాపాలు మొదలవుతాయని అన్నారు.
'ఇండియా' కూటమి బలోపేతంపై దృష్టి
విపక్ష కూటమి సమావేశానికి టీఎంసీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) మినహా కూటమిలోని అన్ని పార్టీలు వచ్చాయని ఐయూఎంఎల్ ఎంపీ మహ్మద్ బషీర్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, ఇండియా కూటమి బలోపేతం గురించి చర్చించుకున్నామని అన్నారు.