తెలంగాణ

telangana

ETV Bharat / bharat

26 విపక్ష పార్టీల భేటీ.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ! - బెంగళూరు విపక్షాల సమావేశం

Rahul Gandhi, who is attending the second opposition meeting in Bengaluru today, is going to be projected as the opposition's Prime Ministerial candidate for the 2024 polls, party leaders said on Monday. -- Reports ETV Bharat's Amit Agnihotri.

opposition meeting in bengaluru
opposition meeting in bengaluru

By

Published : Jul 17, 2023, 6:33 PM IST

Updated : Jul 17, 2023, 10:31 PM IST

22:21 July 17

ముగిసిన విపక్ష నేతల సమావేశం

26 విపక్ష పార్టీల నేతలు సమావేశం ముగిసింది. 'మేమంతా సమైక్యంగా నిలబడ్డాం' అనే నినాదంతో సమావేశం జరిగింది. ఇదే నినాదంతో.. బెంగళూరులో ఫ్లెక్సీలు కట్టారు. రాజకీయంగా అభిప్రాయభేదాలు ఉన్న విపక్ష పార్టీలు ఐక్యత సాధించడం చాలా పెద్దవిషయం. రాజకీయ ప్రయోజనాలపై రాజీపడి నిర్ణయం తీసుకోవడం విపక్షాలకు సవాల్‌గా మారనుంది. బంగాల్‌లో.. తృణమూల్‌తో ఎలాంటి పొత్తు ఉండదని బెంగళూరు వచ్చిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి చెప్పారు. విపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం ఆటలో కీలక మలుపు అని కాంగ్రెస్ పేర్కొంది. ఇప్పటికే దయ్యంగా మారిన NDAకు ఊపిరిలూదేందుకు భాజపా యత్నిస్తోందని ఎద్దేవా చేసింది.

19:23 July 17

విపక్షాల భేటీ ప్రారంభం

బీజేపీనీ గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేపట్టిన బెంగళూరు సమావేశం ప్రారంభమైంది. ఈ విందు సమావేశానికి బిహార్ సీఎం నీతీశ్​ కుమార్​, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​, పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్​జేడీ చీఫ్​ లాలూ ప్రసాద్ యాదవ్​ పాల్గొన్నారు. సమావేశానికి వచ్చిన నేతలకు స్వాగతం పలికారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.

18:17 July 17

26 విపక్ష పార్టీల భేటీ.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ!

Opposition Meeting In Bengaluru : 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అతి కీలకమైన విపక్ష కూటమి భేటీ.. కాసేపట్లో బెంగళూరులో ప్రారంభం కానుంది. తాజ్​ వెస్ట్ ఎండ్ హోటల్​లో జరిగే ఈ సమావేశానికి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 26 భాజపాయేతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిని ఓడించేందుకు రోడ్​మ్యాప్​ ఖరారు చేయడమే ముఖ్యఅజెండాగా విపక్ష పార్టీలు రెండు రోజులు సమావేశం కానున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 7.30కి విపక్ష నేతల విందు భేటీ.. కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగంతో మొదలు కానుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా.. బెంగళూరు సమావేశానికి హాజరవుతున్నారు.

సోమవారం విపక్ష నేతల భేటీ అజెండాలోని ముఖ్యాంశాలు:

⦁ 2024 సార్వత్రిక ఎన్నికలకు కనీస ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన సహా కూటమిలోని అన్ని పార్టీలు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల ఖరారుకు సబ్​కమిటీ ఏర్పాటుపై నేతలు చర్చించనున్నారు.

⦁ రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాటుకు అనుసరించాల్సిన ప్రక్రియపై సమాలోచనలు చేయనున్నారు. కూటమికి ఓ పేరును ఖరారు చేయడంపైనా చర్చించే అవకాశముంది.

⦁ ఈవీఎంలకు సంబంధించిన అంశాలు సహా ఈసీకి ఎన్నికల సంస్కరణలపై చేయాల్సిన సూచనలపైనా విపక్ష నేతలు చర్చిస్తారని తెలిసింది.

⦁ కూటమికి ఓ ఉమ్మడి సెక్రటేరియట్ ఏర్పాటుపైనా బెంగళూరు భేటీలో చర్చించనున్నారు.

మంగళవారం ఉదయం 11 గంటలకు విపక్ష పార్టీల నేతలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ భేటీ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.

శరద్ పవార్​ హాజరుపై గందరగోళం..
బీజేపీని ఎదుర్కొనే లక్ష్యంతో కాంగ్రెస్​ సహా దేశంలోని వేర్వేరు పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. తొలిసారి జూన్​ 23న పట్నాలో సమావేశమయ్యాయి. నాటి భేటీకి 15 పార్టీల నేతలు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరింది. అయితే.. విపక్ష కూటమిలోని భాగస్వామ్య పక్షాల సమన్వయం, కనీస ఉమ్మడి ప్రణాళిక ఖరారులో కీలకంగా వ్యవహరిస్తారని భావించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్​ పవార్​ మాత్రం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్​సీపీలో చీలిక నేపథ్యంలో పవార్​ పాత్రపై అనుమానాలు నెలకొన్నాయి. బెంగళూరు సమావేశానికి శరద్​ పవార్ వెళ్లరన్న వార్తలూ ఓ దశలో వినిపించాయి. అయితే.. ఏం జరిగినా సరే మంగళవారం జరిగే భేటీకి పవార్ హాజరవుతారని ఎన్​సీపీ అధికార ప్రతినిధి ప్రకటించారు.

ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు?
విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో.. కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ జోరందుకుంది. ఇది అంత ముఖ్యవిషయం కాదని పట్నా సమావేశంలోనే విపక్ష నేతలు స్పష్టం చేసినా.. అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్​ జోడో యాత్రతో దేశం మొత్తం చుట్టేసి, 'మాస్​ లీడర్​'గా మారిన రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి అభ్యర్థిగా సరైన వ్యక్తి అని కాంగ్రెస్​ నేతలు కొందరు బలంగా వాదిస్తున్నారు.

"రాహుల్ గాంధీ.. కాంగ్రెస్​లో మాత్రమే కాక యావత్​ విపక్షంలో ఉన్న మాస్ లీడర్. భారత్​ జోడో యాత్ర చేయడంపై గత(పట్నా) సమావేశంలో నేతలంతా ఆయన్ను ప్రశంసించారు." అని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.

"2024 లోక్​సభ ఎన్నికలకు రాహుల్​ గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థి అనే విషయంలో కాంగ్రెస్​ నేతలకు ఎలాంటి అనుమానం లేదు. భారత్​ జోడో యాత్రతో.. దేశంలోనే ఆయన అత్యంత కీలకమైన విపక్ష నేతగా ఎదిగారు. రాహుల్​ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కొన్ని నెలల క్రితం మా పార్టీ ఎంపీ మాణిక్కం ఠాకూర్​ కూడా చెప్పారు." అని ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు సీడీ మెయప్పన్ ఈటీవీ భారత్​తో చెప్పారు.

అవకాశవాదుల సమావేశం
బెంగళూరులో విపక్ష నేతల సమావేశం నేపథ్యంలో తీవ్ర విమర్శలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ కార్యక్రమాన్ని.. అవకాశవాదులు, అధికార దాహంతో కూడిన నేతల భేటీగా అభివర్ణించింది. ఇలాంటి కూటమితో దేశానికి వర్తమానంలో, భవిష్యత్​లో ఎలాంటి మేలు జరగదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.

Last Updated : Jul 17, 2023, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details