Opposition Meeting In Bengaluru : 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవడమే లక్ష్యంగా.. సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి.. వివిధ పార్టీల ముఖ్యనేతల హాజరుకానున్నారు. ఈ మీటింగ్‌లో దాదాపుగా 26 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై.. ప్రతిపక్షాలు చర్చిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కోవడంపై వ్యహాలు రూపొందిస్తాయని పేర్కొన్నాయి.
ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని ప్రారంభించే అంశంపై ఈ సమావేశంలోనే చర్చ జరగనున్నట్లు తెలిసింది. దాంతో పాటు మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడంపైముందడుగు పడే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఓ సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో సంస్కరణలపై ఈసీకి ఇచ్చే ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు చర్చలు జరుపుతాయని తెలిసింది. ప్రతిపక్షాల కూటమికి ఓ పేరును కూడా ఈ సమావేశంలోనే ప్రతిపాదించే అవకాశం ఉంది.
పార్లమెంట్లో దిల్లీ ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. తాము కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అంతకుముందు జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పట్నా సమావేశానికి 15 పార్టీలు హాజరు కాగా.. సోమవారం జరగబోయే ఈ మీటింగ్‌కు 26 పార్టీలు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ చీలిక, బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస వంటి పరిణామాల మధ్య ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రణాళికలను ప్రతిపక్షాలు రూపొందిస్తాయని పార్టీల వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షాల ఐక్యత అంశం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్‌తో నియంత్రణ చేయించడం వంటి వాటిపై పార్టీలు చర్చిస్తాయని వర్గాలు వివరించాయి.