తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉమ్మడి అభ్యర్థితో రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి.. 17 పార్టీల తీర్మానం - Mamata Banerjee

opposition meeting
మమత నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీ

By

Published : Jun 15, 2022, 3:38 PM IST

Updated : Jun 15, 2022, 6:54 PM IST

18:53 June 15

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని 17 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు ఎన్​డీఏపై పోటీలో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు తీర్మానించాయి. అయితే, మొదటి నుంచి అనుకుంటున్నట్లు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ను ఒప్పించటంలో విఫలమయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో బంగాల్​ ముఖ్యమంత్రి నేతృత్వంలో 17 పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​ను ఒప్పించే ప్రయత్నం చేశారు నేతలు. వారి ఆఫర్​ను పవార్ మరోమారు తిరస్కరించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్​, సమాజ్​వాదీ, ఎన్​సీపీ, డీఎంకే, ఆర్​జేడీ, వామపక్షాలు​ సహా మొత్తం 17 పార్టీల నేతలు హాజరవగా.. ఆప్​, తెరాస​, బీజేడీ, శిరోమణి అకాలీదళ్​ దూరంగా ఉన్నాయి.

"రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని శరద్​ పవార్​ను అన్ని పార్టీల నేతలు కోరారు. కానీ, ఆ ప్రతిపాదనను పవార్ తిరస్కరించారు. భాజపాయేతర పార్టీలన్నింటితో ఉమ్మడి అభ్యర్థిపై చర్చించాలని పలువురు నేతలు మల్లికార్జున్​ ఖర్గే, పవార్​, మమతను కోరారు. "

- టీఆర్​ బాలు, డీఎంకే నేత

తెరపైకి మరో ఇద్దరి పేర్లు:శరద్​ పవార్​ సరైన అభ్యర్థిగా భావిస్తున్న విపక్షాలు మరోమారు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు ఆర్​జేడీ నేత మనోజ్​ ఝా పేర్కొన్నారు. మరోవైపు.. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థే విపక్షాల తరఫున బరిలో నిలుస్తారని సీపీఐ నేత బినోయ్​ విశ్వమ్​ తెలిపారు. బుధవారం జరిగిన సమావేశం కేవలం శరద్​ పవార్​ పేరు మాత్రమే చర్చకు వచ్చినట్లు చెప్పారు. మరోవైపు.. ఫరూక్​ అబ్దుల్లా, గోపాలక్రిష్ణ గాంధీ పేర్లను మమతా బెనర్జీ సూచించినట్లు ఆర్​ఎస్​పీ నేత ఎన్​కే ప్రేమ్​చంద్రన్​ వెల్లడించారు.

కాంగ్రెస్​ది నిర్మాణాత్మక పాత్ర:రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాల మధ్య ఏకాభిప్రాయంలో కాంగ్రెస్​ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్​ నేత మల్లికార్జున్​ ఖర్గే. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో విపక్షాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి రాజ్యాంగం, లౌకికతత్వాన్ని కాపాడుతూ.. విద్వేష శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి అయి ఉండాలన్నారు.

అభ్యర్థిత్వంపై అప్పుడే మాట్లాడటం సరికాదు:రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున బరిలో నిలిచేందుకు శరద్​ పవార్​ ఆసక్తి చూపకపోవటం వల్ల గోపాలక్రిష్ణ గాంధీ పేరు చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్నారు ఆయన. 2017లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు గోపాలక్రిష్ణ గాంధీ. ​

మమత, ఖర్గేలతో రాజ్​నాథ్​ భేటీ:విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపాలని చూస్తున్న తరుణంలో.. రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భాజపా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. తాజాగా మల్లికార్జున్​ ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేశ్​ యాదవ్​తో మాట్లాడినట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

17:09 June 15

ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాల తీర్మానం

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని తీర్మానం చేశారు 17 పార్టీల నేతలు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో.. దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. "రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని విపక్ష పార్టీల నేతలు తీర్మానం చేశారు. భారత రాజ్యాంగానికి సంరక్షకుడిగా సేవ చేయగల అభ్యర్థి, ప్రజాస్వామ్యానికి, దేశ సామాజిక నిర్మాణానికి మరింత నష్టం కలిగించుకండా మోదీ ప్రభుత్వాన్ని ఆపగలిగే వ్యక్తిని నిలపాలని నిర్ణయించారు. " అని తెలిపారు సుధీంద్ర కులకర్ణి

మంచి ఆరంభం:ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆ అభ్యర్థికి ప్రతి పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సమావేశానికి హాజరుకాని వారిని సైతం సంప్రదిస్తామని, ఇది ఒక మంచి ఆరంభమన్నారు. కొన్ని నెలల తర్వాత అంతా కలిసి సమావేశమయ్యామని, భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలు జరుగుతాయన్నారు.

15:29 June 15

ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాల తీర్మానం

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏకు ప్రత్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపే అంశంపై చర్చించేందుకు.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో దిల్లీలోని కాన్​స్టిట్యూషనల్​ క్లబ్​లో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి సహా.. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షాలు ఐక్యంగా కేంద్రాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి కాంగ్రెస్​, టీఎంసీ, ఎన్​సీపీ, డీఎంకే సహా మొత్తం 17 పార్టీల నేతలు హాజరవగా.. ఆప్​, తెరాస​, బీజేడీ, శిరోమణి అకాలీదళ్​ దూరంగా ఉన్నాయి.

రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే విపక్షాల సమావేశానికి గత వారం పిలుపునిచ్చారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఏడుగురు ముఖ్యమంత్రులు సహా మొత్తం 19 రాజకీయ పార్టీలకు లేఖ రాశారు దీదీ. జులై 18 జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు, ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలని కోరారు. ఈ సమావేశం నేపథ్యంలో దిల్లీ వెళ్లిన మమతా బెనర్జీ, పలువురు లెఫ్ట్​ పార్టీల నేతలు మంగళవారం.. ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 15, 2022, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details