Opposition Meet President : ఘర్షణలతో అట్టుడుకిపోతున్న మణిపుర్ విషయంలో జోక్యం చేసుకుని.. శాంతి నెలకొల్పాలని విపక్ష కూటమి ఇండియాకు చెందిన నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. మణిపుర్‌ను సందర్శించిన 21 మంది ఎంపీలతో కలిసి ఇండియాకు చెందిన సభాపక్ష నేతలు రాష్ట్రపతితో బుధవారం సమావేశమయ్యారు. ఈ బృందానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు.
మణిపుర్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్ర ప్రభుత్వానికి ఉందని విపక్ష నేతలు రాష్ట్రపతికి విన్నవించారు. ఈ విషయమై తక్షణమే పార్లమెంటులో ప్రకటన చేసేలా.. ప్రధాన మంత్రిపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించారు. అలాగే మణిపుర్‌కు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతిని విన్నవించారు. అప్పుడే ఆ రాష్ట్ర మహిళలకు జరిగిన అన్యాయం కొంత సరిదిద్దినట్లవుతుందని అన్నారు.
"మణిపుర్‌లో పర్యటించిన ఇండియా కూటమి ఎంపీలు సహా మొత్తం 31 మంది రాష్ట్రపతిని కలిశాం. మణిపుర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ.. అత్యవసరంగా పార్లమెంట్‌లో ప్రసంగించేలా ఒత్తిడి తీసురావాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కోరాం. అలాగే ప్రధాని మోదీ ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరియాణాలోని నూహ్‌లో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలను ప్రస్తావించాం. ప్రధాని మోదీ.. మణిపుర్‌లో పర్యటించి అక్కడ శాంతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలి."