Opposition Meet In Mumbai :2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని అధికార ఎన్డీయేపై ఉమ్మడి పోరుకు నడుం బిగించిన విపక్షాల 'ఇండియా' కూటమి మూడో సమావేశం జరిగింది. ముంబయిలో రెండు రోజుల పాటు జరిగే ఈ కీలక భేటీకి 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ మూడో సమవేశం పూర్తైన తర్వాత నేతలు.. ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. శుక్రవారం.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెబుతామని శివసేన-యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
ఉద్ధవ్ ఠాక్రే విందు ఏర్పాటు..
Opposition Meet Today :బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను ఎదుర్కొనే వ్యూహాలపై గురువారం రాత్రి జరిగిన సమావేశంలో విపక్ష కూటమి నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. 'ఇండియా' కూటమి లోగో ఆవిష్కరణ పాటు సమన్వయ కమిటీ ఏర్పాటు, సంయుక్త కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశం అనంతరం వివిధ పార్టీల నేతలకు ఉద్ధవ్ ఠాక్రే విందును ఏర్పాటు చేశారు.
ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు వివిధ పార్టీల అధినేతలు శరద్‌పవార్ (ఎన్సీపీ), నీతీశ్ కుమార్(జేడీయూ), లాలూ ప్రసాద్‌యాదవ్(ఆర్జేడీ), మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), కేజ్రీవాల్(ఆప్), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-యూబీటీ), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీ), అఖిలేశ్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), హేమంత్‌సోరెన్(జేఎంఎం), ఎంకే స్టాలిన్ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), మహబూబా ముఫ్తీ (పీడీపీ), కృష్ణ పటేల్ (అప్నాదళ్-కెమెరవాడి), జయంత్‌సిన్హా (ఆర్‌ఎల్డీ), తిరుమవలవన్ (విడుదలై చిరుతైగల్ కట్చి -వీసీకే) సహా పలు పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
'దేశంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే..'
India Front Meeting :ఈ భేటీకి ముందు పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తామంతా ఏకమైనట్టు ఇండియా కూటమి నేతలు తెలిపారు. తామంతా బీజేపీను ఎదుర్కొనేందుకు ఉమ్మడి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఏకమయ్యేందుకు ఇదే సరైన సమయం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పేదరికం, నిరుద్యోగం, రైతుల సంక్షేమం వంటి సమస్యల్ని పరిష్కరించడంలో మోదీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.
'మోదీ సర్కార్ ఒక మనిషి కోసమే..'
దేశంలోని యువత ఉపాధిని కోరుకుంటున్నారు, ప్రజలు ద్రవ్యోల్బణం నుండి బయటపడాలని కోరుకుంటున్నారు.. కానీ మోదీ సర్కార్ ఒక మనిషికోసమే పనిచేస్తోందని దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఇండియా కూటమి దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కోసమని.. ఇది దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు. యువతే దేశానికి బలమని పీడీపీ నేత, కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు పాలించిన నేతలు యువతకు దిశానిర్దేశం చేయడంతో పాటు జేఎన్‌యూ, ఐఐఎంలు, ఇస్రో వంటి సంస్థల్ని స్థాపించేందుకు కృషిచేశారన్నారు. ఒకే ఆలోచన కలిగిన పార్టీలను ఏకం చేసి విపక్ష కూటమి ఏర్పాటు చేసే ఆలోచనను లాలూ, నీతీశ్ నిర్ణయించారని.. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ చెప్పారు.