Opposition Manipur Visit : మణిపుర్ వివాదాన్ని సత్వరమే పరిష్కరించకుంటే.. దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి హెచ్చరించారు. ఆదివారం విపక్ష కూటమి నేతలతో కలిసి మణిపుర్ గవర్నర్ అనసూయ ఉయికేను కలిసిన తర్వాత.. అధీర్ రంజన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'గవర్నర్ మా అభిప్రాయాలను విన్నారు. వాటిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. వర్గాల మధ్య అపనమ్మకం తొలగించడానికి.. ప్రజలతో మాట్లాడేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం మణిపుర్‌ను సందర్శించాలని సూచించారు' అని ఆయన తెలిపారు.
Opposition Delegation To Manipur :మణిపుర్‌లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడానికి 21 మంది ఎంపీలతో కూడిన ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రతినిధి బృందం శనివారం మణిపుర్‌కు చేరుకుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు.. బిష్ణుపుర్, చురాచంద్‌పుర్ జిల్లాల్లోని ఇంఫాల్, మోయిరాంగ్‌లో ఉన్న అనేక శిబిరాలను సందర్శించి.. బాధితులను కలుసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం మణిపుర్ గవర్నర్ అనసూయ ఉయికేను రాజ్‌భవన్‌లో కలిసి.. తమ పరిశీలనల మీద మెమోరాండం సమర్పించారు. మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.