Opposition Alliance INDIA Meeting :ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల నాలుగో సమావేశం ఈ నెల 19న దిల్లీ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇండియా కూటమి భేటీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు "మే నహీ, హమ్" (నేను కాదు మేము) అనే నినాదంతో పార్టీలు ముందుకు సాగాలని భావిస్తున్నాయని తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎదుర్కొనేందుకు కొత్త నినాదాన్ని తీసుకువస్తున్నట్లు మరో సీనియర్ నేత చెప్పారు. ఈ సమావేశంలో పార్టీల మధ్య సీట్ల పంపకం, ఉమ్మడి ఎన్నికల ర్యాలీలు, కార్యక్రమాల రూపకల్పన వంటి వాటిపై ప్రణాళికలు సిద్ధం చేసుకోనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కుల గణన, MSPకి చట్టపరమైన హామీ, కార్మికులకు సామాజిక భద్రత వంటి అంశాలను ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని సమాచారం. గత 10 ఏళ్ల ప్రధాని మోదీ పాలనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలో సామాన్యుడి జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చిందనే అంశాలను హెలైట్ చెయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన శాసనసభల ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించడం వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో తాము గెలుపొందామని బీజేపీ చెబుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మరోసారి నెగ్గి, కేంద్రంలో హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది కమలం పార్టీ. సానుకూల ఎజెండాను తెరపైకి తెస్తున్న ఎన్డీఏను ఎదుర్కోవాలంటే అలాంటి ప్రత్యామ్నాయ ఎజెండానే తీసుకురావడం విపక్ష కూటమి ముందున్న పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది.