తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇండియా' కూటమి భేటీకి కీలక నేతలు డుమ్మా- నష్టనివారణలో కాంగ్రెస్! - ఇండియా కూటమి సమావేశం

Opposite Party Meeting Congress : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఇండియా కూటమిపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. సార్వత్రిక సమరానికి ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవటం వల్ల ఇండియా కూటమి నేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో తలపడితే ఇలాంటి ఫలితాలే వచ్చే ప్రమాదం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే విపక్ష నేతలు సమావేశానికి గైర్హాజరుపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది.

Opposite Party Meeting Congress
Opposite Party Meeting Congress

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 5:50 PM IST

Opposite Party Meeting Congress : డిసెంబరు 6న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి మిత్రపక్షాల గైర్హాజరు పెద్ద సమస్య కాదని చూపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఖర్గే ఇండియా కూటమి నాయకులందరినీ సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారని, దాదాపు 27 లేదా 28 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. కూటమి నేతలతో ఇది అధికారిక సమావేశం కాదని, త్వరలో మరో భేటీ నిర్వహిస్తామని ఈటీవీ భారత్​తో చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం చాలా తక్కువ సమయం ఉందని కాంగ్రెస్​కు తెలుసని అన్నారు. లోక్​సభ ఎన్నికల కోసం పూర్తి శ్రద్ధ, సంకల్పంతో కాంగ్రెస్​ సిద్ధమవుతోందని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం ఎన్నికల్లో కాంగ్రెస్ బిజీ అయిపోవడం వల్ల గత రెండు నెలలుగా ఇండియా కూటమి ఎటువంటి సమావేశం నిర్వహించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి, లోక్​సభ ఎన్నికల్లో కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఎన్నికల్లో బోల్తా కొట్టడం వల్ల కాంగ్రెస్​పై మిత్రపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఎస్​పీ, జేడీయూ పార్టీలు మధ్యప్రదేశ్​లో తమతో కలిసి కాంగ్రెస్ కలిసి రాకపోవడంపై మండిపడ్డాయి. కొందరు అభ్యర్థులను సైతం ఎన్నికల్లో నిలబెట్టాయి. అందుకే ఆ పార్టీల అధినేతలు విపక్ష కూటమి సమవేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

'2024 లోక్​సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్​ను ఎదుర్కోవడానికి ఇండియా కూటమి అవసరమని ప్రాంతీయ పార్టీలకు తెలుసు. ఇండియా కూటమి మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. డిసెంబర్ 4న పార్లమెంట్​లోని ఖర్గే ఛాంబర్​లో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఆర్థిక అసమానతలు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై పార్లమెంట్​లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. అలాగే టీఎంసీ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాను కేంద్రం టార్గెట్ చేయడాన్ని వ్యతిరేకించారు. ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించడానికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా వ్యతిరేకించేందుకు సిద్ధంగా ఉన్నారు.' అని ఏఐసీసీ నేత ఒకరు ఈటీవీ భారత్​కు తెలిపారు.

ప్రతినిధులను పంపే అవకాశం!
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్​, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​, సమాజ్​వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ డిసెంబర్ 6న జరిగే ఇండియా కూటమి సమావేశానికి హాజరుకావట్లేదు. వీరందరూ తమ ప్రతినిధులు పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పందించాయి.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిక్​ ఆ రాష్ట్రంలో తుపాను బీభత్సం సృష్టించడం వల్ల కూటమి సమావేశానికి హాజరుకావట్లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అనారోగ్య సమస్యలు, బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆమె కుటుంబంలో ఓ వివాహ వేడుకకు హాజరుకావాల్సి ఉండడం వల్ల విపక్ష కూటమి సమావేశానికి గైర్హాజరు అవుతున్నారని పేర్కొన్నాయి. ఈ ముగ్గురు నేతలు ఇండియా కూటమి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఇతర నాయకులు కూడా ముందస్తు కార్యక్రమాలు ఉండడం వల్ల ఇండియా కూటమి సమావేశానికి హాజరుకాకపోవచ్చని పేర్కొన్నాయి. ఉమ్మడి వ్యూహం, ప్రచారం, సీట్ల పంపకం కోసం త్వరితగతిన విపక్షాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపాయి.

అఖిలేశ్​ గైర్హాజరు
మరోవైపు, ఇండియా కూటమి సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ హాజరుకాబోరని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. అఖిలేశ్​కు బదులు పార్టీ అగ్రనేత రామ్​గోపాల్​ యాదవ్ కానీ వేరే నేతలేవరైనా హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​కు పూర్వాంచల్ ప్రాంతంలో కొన్ని కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉందన్నారు రామ్​గోపాల్ యాదవ్​. అందుకే ఆయన విపక్ష కూటమి సమావేశానికి హాజరుకావట్లేదని చెప్పారు.

మరోవైపు.. దేశ ప్రజలు బీజేపీని తరిమికొట్టాలని చూస్తున్నారని అన్నారు ఎస్​పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్​. ప్రజలు అధికారంలో ఉన్నవారిపై కోపంతో బీజేపీకి ఓట్లు వేశారని తెలిపారు. 'ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలతాలను బట్టి తెలుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో ఇండియా కూటమిని మరింత బలపరుస్తాయి. రాబోయే రోజుల్లో ప్రజలు మార్పు కోసం ఓటేస్తారు.' అని లఖ్​నవూలో మీడియాతో అఖిలేశ్​ అన్నారు.

మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌, ఎస్​పీ మధ్య విభేదాలు తలెత్తాయి. హస్తం పార్టీ ఏక పక్షంగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటంపై అఖిలేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది సార్వత్రిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై ప్రభావం చూపుతుందని హస్తం పార్టీని అప్పుడే ఒకింత గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న ఇండియా కూటమి భేటీ పట్ల అఖిలేశ్ పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.

డిసెంబరు మూడో వారంలో ఇండియా కూటమి మరో కీలక భేటీ జరగనుందని సీడబ్ల్యూసీ సభ్యుడు గుర్​దీప్ సప్పల్ తెలిపారు. 'ఇండియా కూటమి సమావేశం డిసెంబర్ 6 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతుంది. ఆ తర్వాత విపక్ష ముఖ్య నేతలతో మరో సమావేశం డిసెంబరు మూడో వారంలో జరుగుతుంది.' అని గుర్​దీప్ అన్నారు.

రాజ్​పుత్​ కర్ణిసేన చీఫ్​ హత్య- ఇంట్లోనే కాల్చి చంపిన దుండగులు

'ఒంటెద్దు పోకడ వల్లే'- కాంగ్రెస్​పై ఇండియా పార్టీలు ఫైర్! ​కూటమిపై ఫలితాల ప్రభావం ఎంత?

ABOUT THE AUTHOR

...view details