జమ్ముకశ్మీర్‌లో భయోత్పాతం సృష్టించేందుకే ఉగ్రమూకలు వరుస హత్యలకు పాల్పడుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశ విభజన ఆవేదనను ప్రజలు ఇంకా అనుభవిస్తున్నారన్న భగవత్... ఈ చరిత్ర నుంచి దేశ సమగ్రతను ఎలా పరిరక్షించాలో యువత నేర్చుకోవాలని సూచించారు.
భారత సంప్రదాయాలు, మతం, ఆచారాలపై దాడి జరుగుతోందన్నారు. రాబోయే 50ఏళ్లను దృష్టిలో ఉంచుకుని జనాభా నియంత్రణ విధానాన్ని మరోసారి సమీక్షించాలన్న భగవత్.. దేశంలో జనాభా అసమతుల్యత సమస్యగా మారింద్ననారు. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, బిట్ కాయిన్, డ్రగ్స్ వినియోగం పెరగడంపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.
"ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి చిత్రాలు వస్తున్నాయి? కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నారుల వద్ద కూడా ఫోన్ అందుబాటులో ఉంటుంది. వారు అందులో చిత్రాలు చూస్తున్నారు. వాళ్లు ఏం చూస్తున్నారన్న దానిపై నియంత్రణ లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఏం చూపిస్తున్నారన్న దానిపై కూడా నియంత్రణ లేదు. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోంది . దాన్ని ఎలా ఆపాలి. ఇలాంటి అక్రమ వ్యాపారాల నుంచి వచ్చే డబ్బు ఎక్కడికి వెళుతుందో మనకందరికీ తెలుసు. ఆ డబ్బు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. సమాజ హితం కోసం వీటన్నింటిన్నీ నియంత్రించాల్సిన అవసరం ఉంది."