Operation Trident Indian navy: భారత్ ఎదుట తన బలాన్ని అతిగా ఊహించుకొంటే ఏమవుతుందో పాకిస్థాన్‌కు 1971లో తెలిసొచ్చింది. 1967లో అరబ్ దేశాల పై 'ఆపరేషన్ ఫోకస్' పేరిట ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడిచేసి గెలవడాన్ని చూసిన పాక్ తాను కూడా అలానే భారత్‌ను ఓడించాలని కలలుగన్నది. అందుకోసం ప్రయత్నించే క్రమంలో కొరివితో తలగోక్కుంది. చివరికి ఏముంది అప్పుడే సర్వీసులో చేరిన భారత కొత్త నౌకలు కరాచీ నౌకాశ్రయాన్ని ధ్వంసం చేశాయి. ఆ దెబ్బ నుంచి యుద్ధంలో కోలుకోలేక పాక్ రెండు ముక్కలైంది. భారత నావికా దళం కరాచీపై చేపట్టిన 'ఆపరేషన్ ట్రైడెంట్'కు 50 ఏళ్లు నిన్నటితో పూర్తయ్యాయి..!
సోవియట్ హెచ్చరికను పెడచెవిన పెట్టి..!
1971 నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన సోవియట్ యూనియన్ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ కనుక భారత్‌పై దాడి చేస్తే అది దానికి ఆత్మహత్యా సదృశంగా మారుతుందని పేర్కొంది. పాక్ ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టింది. ఈ క్రమంలో లాహోర్ సహా పలు ప్రాంతాల్లో భారత్‌పై దాడి చేయాలంటూ అతివాదులు ర్యాలీలు చేపట్టారు. దీంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 23న పాక్ అధ్యక్షుడు యాహ్యాఖాన్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ నిర్వహించిన 'ఆపరేషన్ ఫోకస్' వలే డిసెంబర్ 3వ తేదీన పాక్‌కు చెందిన 51 యుద్ధ విమానాలు మూడు దఫాలుగా భారత్‌లోని 11 వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై ముందస్తు దాడులు నిర్వహించాయి. దీనికి 'ఆపరేషన్ ఛెంఘిజ్‌ఖాన్' అని పేరుపెట్టారు. పాక్ విమానాలు ఆగ్రా వరకు వచ్చాయి. మరోవైపు పాక్ సైన్యం కశ్మీర్ వద్ద భీకరమైన షెల్లింగ్ మొదలుపెట్టింది. ఈ దాడుల సమయంలో భారత్ ప్రతిస్పందించి నాలుగు పాక్ విమానాలను కూల్చేసింది. ఆ రోజు సాయంత్రమే భారత ప్రధాని ఇందిరాగాంధీ యుద్ధ ప్రకటన చేశారు. ఆ రోజు రాత్రే భారత యుద్ధవిమానాలు పాక్‌లోని లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించాయి.
మిసైల్ బోట్లతో దాడికి వ్యూహం..!
భారత్ నావికాదళం పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. నాటి చీఫ్ అడ్మిరల్ నందకు కరాచీ పోర్టు నిర్మాణాలపై మంచి అవగాహన ఉంది. పాక్ వాయుసేన దాడి చేసిన మర్నాడే కరాచీపై దాడి చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా మిసైల్ బోట్లను ఇందుకు వాడాలనుకున్నారు. ఎందుకంటే అవి వేగంగా కదలడం సహా.. ప్రమాదకరమైన నాలుగు స్టైక్స్ క్షిపణులను కలిగిఉంటాయి. అంతేకాదు వాటిలో ఎలక్ట్రానిక్ కౌంటర్‌మెజర్స్ కూడా అమర్చారు. డిసెంబర్ 4వ తేదీన రష్యా నుంచి కొత్తగా కొనుగోలు చేసిన విద్యుత్ శ్రేణికి చెందిన ఐఎన్‌ఎస్ నిపట్, నిర్ఘాత్, వీర్‌లను సిద్ధం చేశారు. వీటికి అండగా అర్నాల శ్రేణికి చెందిన కార్వెట్లు కిల్తన్, కట్చాల్, ట్యాంకర్ నౌక పుష్పక్‌లు రంగంలోకి దిగాయి. దీనికి 'ఆపరేషన్ ట్రైడెంట్' అని కోడ్‌నేమ్ పెట్టారు. డిసెంబర్ 4వ తేదీ పగటి వేళ కరాచీకి 250 నాటికల్స్ మైళ్ల దూరానికి భారత మిసైల్ బోట్లు చేరుకొన్నాయి. పాక్ గగనతల గస్తీని తప్పించుకొనేందుకు రహస్యంగా సంచరించాయి. పాక్ వైమానిక దాడిని అడ్డుకొనేందుకు వీలుగా రాత్రి కరాచీపై దాడి చేయాలని నిర్ణయించాయి. రాత్రి వేళ మళ్లీ కరాచీ దిశగా భారత నౌకలు పయనించాయి.
ద్వారకా మీద దాడికి ప్రతీకారం..!