రఫేల్ ఒప్పందంలో (rafale deal) అవకతవకలకు ఆధారాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్‌కు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నల్ 'మీడియాపార్ట్' ప్రచురించిన కథనంపై కాంగ్రెస్ స్పందించింది. ఒప్పందాల్లో అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ 'కవర్-అప్' మరోమారు బయటపడిందని విమర్శించింది.
రఫేల్ ఒప్పందంలో జాతీయ భద్రత విషయంలో భాజపా ప్రభుత్వం రాజీపడిందని కాంగ్రెస్ ఆరోపించింది. భారత వైమానిక దళ ప్రయోజనాలను ప్రమాదంలోకి నెట్టడం సహా దేశ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మండిపడ్డారు. 'రఫేల్ ఒప్పందంపై జరిగిన చర్చలకు సంబంధించిన రహస్య పత్రాలను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సుశేన్ గుప్తా అనే మధ్యవర్తి 2015లో స్వాధీనం చేసుకున్న విషయం ఇప్పుడు బటపడిందని అన్నారు. ఈ ఒప్పందంలోని అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం, సీబీఐ-ఈడీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు ఖేరా.