Operation Ajay Israel India : ఇజ్రాయెల్ ఆర్మీ, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారత పౌరులను మన దేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియకు 'ఆపరేషన్ అజయ్'గా పేరు పెట్టింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రత్యేక విమానాలతో పాటు ఇతర ఏర్పాట్లు చేశామని.. విదేశాల్లో ఉన్న మన భారతీయులు భద్రత, శ్రేయస్సుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అన్నారు. గురువారం భారతీయులతో కూడిన మొదటి విమానం మన దేశానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
Israel Palestine War Update :జై శంకర్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ.. రిజిస్టర్ చేసుకున్న భారతీయులకు ఈ-మెయిళ్లను పంపించింది. మిగతా వారికి ఆ తర్వాత వచ్చే విమానాల్లో తరలిస్తామని తెలిపింది. అయితే కొన్ని అంచనాల ప్రకారం ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం గురించి జై శంకర్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో బుధవారం చర్చించారు.