OP Chautala Case: అక్రమాస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు శిక్ష ఖరారు చేసింది దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. నాలుగేళ్లు జైలుశిక్ష, రూ.50లక్షలు జరిమానా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. గతవారం చౌతాలాను దోషిగా నిర్ధరించారు స్పెషల్ జడ్జి వికాస్ ధుల్.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. 1999, జులై 24- 2005, మార్చి 5 మధ్య హరియాణా సీఎంగా చౌతాలా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు. చౌతాలా, ఆయన కుటుంబసభ్యుల పేరుమీద మొత్తం రూ.1467 కోట్ల మేర ఆస్తులున్నట్లు గుర్తించింది సీబీఐ. మొత్తంగా చౌతాలాకు రూ.6.9 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు లెక్కించింది.
ఈ మొత్తాన్ని దేశవిదేశాల్లో వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. నగదు, నగలు కాకుండా.. 43 స్థిరాస్తులు పోగుచేసినట్లు సీబీఐ పేర్కొంది. ఎఫ్ఐఆర్లో పొందుపర్చినవే కాకుండా.. చౌతాలా కుటుంబానికి చెందిన చాలా ఆస్తులు అక్రమంగా సంపాదించినవి ఉన్నట్లు వెల్లడించింది. 2005లో చౌతాలాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2010, మార్చి 26న ఛార్జి షీట్ దాఖలు చేసింది.