Oommen Chandy Funeral : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అంత్యక్రియలు గురువారం రాత్రి 12 గంటల సమయంలో జరిగాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల అశ్రునయనాల మధ్య.. కొట్టాయం జిల్లాలోని పూతుపల్లి సెయింట్ జార్జ్ ఆర్థొడాక్స్ చర్చిలో చాందీ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఆయన కోరిక మేరకు అధికార లాంఛనాలు లేకుండా అంత్యక్రియలు జరిగాయి. చాందీకి కడసారి వీడ్కోలు పలకడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు.. చాందీ అంత్యక్రియలకు హాజరయ్యారు.
చాందీకి కన్నీటి వీడ్కోలు.. స్వగ్రామంలో అంత్యక్రియలు అంతకుముందు గురువారం ఉదయం కొట్టాయంలోని తిరునక్కర మైదానంలో సందర్శనార్థం ఉంచిన చాందీ పార్థివ దేహానికి.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు చాందీకి ఘనంగా నివాళులర్పించారు. వీరితో పాటు నటులు మమ్ముట్టి, సురేష్ గోపి, మత పెద్దలు, వేలాది మంది ప్రజలు చాందీకి నివాళులర్పించారు.
150 కిలోమీటర్లు.. 36 గంటలు..
తిరువనంతపురం నుంచి చాందీ భౌతికకాయంతో బయలుదేరిన వాహనం.. 150 కిలోమీటర్ల దూరంలోని పూతుపల్లి చేరేందుకు 36 గంటలు పట్టిందంటే.. ప్రజలు ఏ స్థాయిలో వచ్చారో అర్థం చేసుకోవచ్చు. దారి పొడవునా ఆ వాహనాన్ని ఆపి.. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. జనం రద్దీ ఎక్కువ కావడం వల్ల ఒక్కో చోట సుమారు గంట సేపు ఆగాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రానికి పుథుపల్లిలోని 'కోరట్టు వల్లక్కలిల్' ఇంటికి ఆయన పార్థివదేహం చేరుకుంది. 79 ఏళ్ల ఊమెన్ చాందీ బెంగళూరులో క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
ఐదు దశాబ్దాలకు పైగా అనుభవం..
ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏనాడూ పార్టీ మారకపోవడం గమనార్హం.