Oommen Chandy death : కేరళ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరన్ వెల్లడించారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని చిన్మయ మిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. చాందీ మృతికి సంతాపంగా కేరళ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. మంగళవారం పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు తెలిపింది.
Oommen Chandy disease : ఊమెన్ చాందీ కుటుంబ సభ్యులు సైతం ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. చాందీ కుమారుడు చాందీ ఊమెన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. 'నాన్న చనిపోయారు' అని చిన్న పోస్ట్ చేసిన ఆయన... మిగతా వివరాలేవీ తెలియజేయలేదు. అయితే, చాందీ.. క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ కన్నుమూశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 4.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వివరించాయి.
బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ.. కర్ణాటక మాజీ మంత్రి టీ జాన్ నివాసంలో ఉంచిన ఊమెన్ చాందీ భౌతికకాయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు. చాందీ కుటుంబ సభ్యులను రాహుల్ ఓదార్చారు. కేరళలో అసలైన ప్రజానేత చాందీనే అని రాహుల్ పేర్కొన్నారు. కేరళ స్ఫూర్తిని ఆయన ఘనంగా చాటారని చెప్పారు.
ప్రముఖుల సందర్శన అనంతరం చాందీ భౌతికకాయాన్ని తిరువనంతపురానికి తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చాందీ కుటుంబ సభ్యులతో సోనియా, రాహుల్
చాందీ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రాహుల్
విజయన్ సంతాపం..
చాందీ మృతి పట్ల ప్రస్తుత కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ఊమెన్ చాందీ సమర్థమైన పాలకుడని కొనియాడారు. ప్రజాజీవితాల్లో ఆయన భాగమైన తీరు అభినందనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా చాందీతో ఉన్న అనుబంధాన్ని పినరయి విజయన్ గుర్తుచేసుకున్నారు. "ప్రజాజీవితాన్ని మేమిద్దరం ఒకేసారి ప్రారంభించాం. ఒకే ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యాం. విద్యార్థులుగా ఉన్న సమయంలోనే మేమిద్దరం రాజకీయాల్లోకి వచ్చాం. ఆయనకు తుదివీడ్కోలు పలకడం బాధకలిగిస్తోంది" అని విజయన్ పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షంషీర్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, కేంద్ర మంత్రి వీ మురళీధరన్ సహా వివిధ పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
Oommen Chandy date of birth : 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో ఊమెన్ చాందీ జన్మించారు. సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా మారారు. 1970లో 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నడూ ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నిసార్లూ పూతుపల్లి నుంచే విజయం సాధించారు. కార్మిక, హోం, ఆర్థిక శాఖ మంత్రిగా కే కరుణాకరన్, ఏకే ఆంటోనీ మంత్రివర్గాల్లో పనిచేశారు. రెండుసార్లు సీఎంగా సేవలందించారు. 2004 నుంచి 2006, 2011 నుంచి 2016 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేరళ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగానూ ఉన్నారు. ఒక్కసారి కూడా పార్టీ మారకపోవడం చాందీ అంకితభావానికి నిదర్శనంగా ఆయన అనుచరులు చెబుతుంటారు.