ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం వరుస అంతరాయాలు ఎదుర్కొంటోంది. టీకాల కొరత, నత్తనడకన పంపిణీ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దేశంలో కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4,744 కోట్లు ఖర్చు చేసింది. వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లలో ఇది 14 శాతం కన్నా తక్కువ. కరోనా వ్యాప్తిని శీఘ్రమే అదుపులోకి తీసుకురావాల్సిన ప్రస్తుత సమయంలో.. నిధులను ఖర్చు చేసే విషయంలోనూ ఇంత జాప్యం నెలకొంది.
టీకాల కోసం సీరం సంస్థకు రూ.3,639.67 కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1,104.78 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సీరం సంస్థకు చేసిన చెల్లింపులలో... 11 కోట్ల డోసుల కోసం ముందస్తుగా చెల్లించిన రూ.1,732.50 కోట్లు, 15 కోట్ల టీకాల కోసం చేసుకున్న మొదటి ఒప్పందానికి సంబంధించిన రూ.2,353.09 కోట్లలో రూ.1,907.17 కోట్లు ఉన్నాయని మంత్రి వివరించారు.
సీరం సంస్థకు ప్రభుత్వం 26.60 కోట్ల డోసుల కోసం ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటివరకు 14.344 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ను ఆ సంస్థ సరఫరా చేసింది. అదేవిధంగా కొవాగ్జిన్ 8 కోట్ల డోసుల కోసం కేంద్రం రూ.1,104.78 కోట్లను చెల్లించింది. రెండో దశలో ఆర్డర్ ఇచ్చిన 5 కోట్ల కొవాగ్జిన్ టీకాలకు సంబంధించిన రూ.787.5 కోట్ల ముందస్తు చెల్లింపులు సైతం ఇందులో ఉన్నాయి.
టీకాల కోసం స్థానిక తయారీదారులకు ఆర్డర్లు ఆలస్యంగా ఇచ్చిందని కేంద్రంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు. అయితే, క్రితం ఆర్థిక సంవత్సరంలో టీకాల కోసం ఎంత వెచ్చించారు, ఈ ఏడాది రూ.35 వేల కోట్ల నుంచి ఎంత ఖర్చు చేశారనే విషయాలను అనురాగ్ ఠాకూర్ వివరించలేదు.
కొత్త ఆర్డర్లు
కేంద్ర ప్రభుత్వ టీకా కార్యక్రమంపై విపక్షాలు తొలి నుంచీ విమర్శలు సంధిస్తున్నాయి. విదేశీ టీకాలకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించడంపై మండిపడుతున్నాయి. ఎక్కువ టీకాలు అందుబాటులో ఉంటే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరాటంకంగా, వేగంగా సాగిపోతుందని ప్రభుత్వానికి సూచించాయి.
ఇంతలో దేశీయ తయారీదారుల నుంచి మార్చి తర్వాత ఎలాంటి కొత్త ఆర్డర్లు చేయలేదన్న వార్తలు వెలువడ్డాయి. వీటిని ఖండించిన కేంద్రం.. కొత్త ఆర్డర్లకు సంబంధించి వివరాలు వెల్లడించింది. సీరం నుంచి 11 కోట్లు, భారత్ బయోటెక్ నుంచి 5 కోట్ల డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు ఏప్రిల్ 28న వెల్లడించింది. ఇందుకోసం రూ.2,520 కోట్లను ముందస్తుగా చెల్లించినట్లు అదేరోజు స్పష్టం చేసింది. టీకా కార్యక్రమం కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.35 వేల కోట్లలో ఇది 7.2 శాతానికి సమానం.