ఉత్తరాఖండ్ రాజకీయాల్లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో భాజపా అధిష్ఠానం సీఎం తీరథ్ సింగ్ రావత్‌ను మార్చేసింది. దేహ్రాదూన్‌లో సమావేశమైన భాజపా ఎమ్మెల్యేలు కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామీని ఎన్నుకున్నారు. భాజపాలో అసమ్మతితో ఈ ఏడాది మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామాతో కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయనకూ సీఎం పదవి మూణ్ణాళ్ల ముచ్చటేగానే ముగిసింది. ఉత్తరప్రదేశ్ నుంచి 2000 సంవత్సరంలో విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లో తొలి నుంచీ పాలనలో అస్థిరత్వమే కొనసాగుతూ వస్తోంది. గత చరిత్రను పరిశీలిస్తే.. ఇప్పటివరకు అక్కడ తొమ్మిది మంది సీఎంలు మారగా.. ఐదేళ్ల పాటు పూర్తికాలం సీఎంగా ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీ తివారీ ఒక్కరు మాత్రమే.
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రులు తొలి సీఎం 354 రోజులే.. ఎన్డీ తివారీ ఐదేళ్లు!
2000, నవంబర్ 9న ఉత్తరాఖండ్ ఆవిర్భవించినప్పటి నుంచి అక్కడ సీఎంలు పూర్తికాలం పాటు కొనసాగడం చాలా చాలా అరుదు అనే చెప్పాలి. రాజకీయ కారణాలతో సుస్థిర పాలనను అందించలేకపోయారు. కాంగ్రెస్ నేత ఎన్డీ తివారీ మినహా ఏ ఒక్కరూ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగలేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నేత ఎన్డీ తివారీ 2002 నుంచి 2007 వరకు పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా సేవలందించి రికార్డు సృష్టించారు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలిసీఎంగా భాజపా నేత నిత్యానంద స్వామి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ పదవిలో ఆయన 354 రోజులే (2000, నవంబర్ 9 నుంచి 2001, అక్టోబర్ 29) కొనసాగగలిగారు. ఆ తర్వాత ఆయన్ను రాజీనామా చేయాలని భాజపా అధిష్ఠానం కోరడంతో స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న భగత్‌సింగ్ కోశ్యారీని భాజపా అధిష్ఠానం నియమించింది. ఆయన 2001,అక్టోబర్ 30న బాధ్యతలు స్వీకరించి 2002, మార్చి 1 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2002లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమిపాలవ్వడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. 2002లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎన్డీ తివారీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఐదేళ్ల పాటు పూర్తికాలం సీఎంగా కొనసాగిన ఒకే ఒక్క సీఎం ఎన్డీ తివారీ.
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రులు ఆ సీఎంలే మళ్లీ.. మళ్లీ!
2007లో జరిగిన ఎన్నికల్లో భాజపా విజయ దుందుభి మోగించడంతో కొత్త సీఎంగా మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి వచ్చారు. ఆయన రెండేళ్ల 111 రోజులు మాత్రమే (2007, మార్చి 7 నుంచి 2009, జూన్ 26వరకు) ఆ పదవిలో కొనసాగారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు సానుకూల ఫలితాలు రాకపోవడంతో ఆయన్ను దించింది. ఆ తర్వాత ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్‌కు సీఎం పగ్గాలు అందించారు. దీంతో ఆయన 2009,జూన్ 27న ప్రమాణస్వీకారం చేసి 2011, సెప్టెంబర్ 10 వరకు సీఎంగా కొనసాగారు. ఆయన కూడా కేవలం రెండేళ్ల 75 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. పోఖ్రియాల్ సారథ్యంలోని ప్రభుత్వంపై భూకుంభకోణం ఆరోపణలు రావడంతో.. పదవికి రాజీనామా చేయడంతో మళ్లీ భువన్ చంద్ర ఖండూరి రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 11న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీసీ ఖండూరి 2012, మార్చి 13 వరకు కొనసాగారు.
2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో విజయ్ బహుగుణ సీఎంగా నియమితులయ్యారు. మార్చి 13, 2012 నుంచి 2014, జనవరి 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. బీఎస్పీ, క్రాంతి దళ్ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ఆ ప్రభుత్వం కొనసాగింది. విజయ్ బహుగుణ దాదాపు రెండేళ్లు మాత్రమే సీఎంగా కొనసాగారు. ఉత్తరాఖండ్‌లో 2013లో వరదలు రావడంతో సహాయక చర్యలు సరిగా చేపట్టలేదంటూ విమర్శలు రావడంతో ఆయన తన సీఎంపదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో హరీశ్ రావత్ కొత్త సీఎంగా నియమితులయ్యారు. అయితే, 2016లో హరీశ్ రావత్‌పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసి భాజపాలో చేరడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో మార్చి నెలలో రాష్ట్రపతిపాలన విధించారు. ఆ తర్వాత హరీశ్‌రావత్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడంతో మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోగలిగారు. దీంతో ఆయన 2016, మే 11 నుంచి 2017, మార్చి 18వరకు మళ్లీ సీఎంగా పాలనను కొనసాగించారు.
తీరథ్ సింగ్‌కూ మూణ్నాళ్ల ముచ్చటే..
మొత్తం 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో భాజపా 57 స్థానాల్లో అఖండ విజయం సాధించింది. సీఎంగా త్రివేంద్రసింగ్ రావత్ సీఎం నియమితులయ్యారు. ఆయన దాదాపు నాలుగేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్నారు. పార్టీలో అసంతృప్తి నేపథ్యంలో భాజపా ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించి తీరథ్ సింగ్ రావత్‌కు పీఠాన్ని అప్పగించింది. అయితే, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల వ్యవధిలోనే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లోకెక్కడం, తదితర కారణాలతో ఆయన్ను తప్పించినట్టు సమాచారం. ప్రస్తుతం కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామీని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి:ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ