ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డుకెక్కిన గుజరాత్‌లోని మొతేరా స్డేడియానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని స్పష్టం చేసింది. ఇదే క్రీడా సముదాయానికి ( స్పోర్ట్స్ కాంప్లెక్స్) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరు కొనసాగుతోందని పేర్కొంది.
రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ మొతేరా స్టేడియాన్ని ప్రారంభించి.. మోదీ పేరు పెట్టడంపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులే కాకుండా నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కచ్చితంగా పటేల్‌కు జరిగిన అవమానం అని మండిపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్‌లు వివరణ ఇచ్చారు. స్టేడియంకు మాత్రమే పేరు మార్చినట్లు తెలిపారు.