Onion Farmers Struggles For Price: వంటకాల్లో తప్పక వాడే పదార్థం ఉల్లి. వంటకానికి రుచిని ఆపాదించడమే కాకుండా, పోషక విలువలు అందిస్తుంది కనుకే ఉల్లి.. వంటకాల్లో తప్పనిసరి పదార్థమై నిలుస్తోంది. అలాంటి ఉల్లిని అత్యధికంగా పండించే రాష్ట్రం మహారాష్ట్ర. దేశంలో పండే ఉల్లిలో 40% మహారాష్ట్రదే. ఏటా మహారాష్ట్ర 25 నుంచి 26 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లి పండిస్తోంది. అంతగా ఈ పంటపై ఆధారపడ్డ రైతులు, వ్యాపారులకు ఇప్పుడు కష్టం వచ్చింది.
ఉల్లి ధర 20 రోజుల వ్యవధిలో సగానికి సగం పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుగాంచిన మహారాష్ట్ర లాసల్‌గావ్ మార్కెట్‌లో ఫిబ్రవరి 9వరకు క్వింటాలు ఉల్లి ధర రూ.1000 నుంచి రూ.1100 మధ్య పలకగా, ఈ నెల 27న అది సగటున రూ.500 నుంచి రూ.550కి పడిపోయింది. ఒక దశలో కిలో ఉల్లి ధర రూ.4 నుంచి రూ.2కు కూడా పడిపోయింది. ఒక్కసారిగా పడిపోయిన ధరల ప్రభావంతో ఇక్కడి ఉల్లి వ్యాపారులు లబోదిబో అంటున్నారు. లాసల్‌గావ్ మార్కెట్‌లో సోమవారం తమ వ్యాపారాలను బలవంతంగా నిలిపివేశారు. ఇతర మార్కెట్‌లలో కూడా ఉల్లి వేలం ప్రక్రియను నిలిపివేస్తామని మహారాష్ట్ర ఉల్లి పెంపకందారుల సంఘం తెలిపింది.
మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిపోవడానికి కారణాలు అనేకం: మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిపోవడానికి కారణాలు అనేకం. ఇందులో ముఖ్యమైనది వాతావరణంలో వచ్చే మార్పులు. సాధారణంగా అక్కడ రైతులు ఉల్లికి సంబంధించి ఏడాదిలో 3 పంటలు పండిస్తారు. ఖరీఫ్‌లో జూన్-జులై మధ్యలో పంట నాట్లు వేసి, సెప్టెంబర్, అక్టోబర్‌లో కోతలు జరుపుతారు. ఖరీఫ్ తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నాట్లు వేసి, జనవరి, ఫిబ్రవరిలో.., రబీ సీజన్‌కు సంబంధించి డిసెంబర్ లేదా జనవరిలో నాట్లు వేసి, మార్చి, ఏప్రిల్‌లో కోతలు చేపడతారు. పండించిన పంటను ఒకే సారి విక్రయించరు. ఎక్కువగా నగదుకేవిక్రయిస్తారు.
ఉల్లి నాణ్యత ఆధారంగా మార్కెట్‌లో ధర: ఖరీఫ్ పంటను ఫిబ్రవరి వరకు, తర్వాత వచ్చిన పంట మే మాసం, జూన్ వరకు మార్కెట్‌కు పంపిస్తారు. ఖరీఫ్, ఆ తర్వాత పండే పంటలో తేమ అధికంగా ఉంటుంది. అందువల్ల ఖరీఫ్ ఉల్లిని గరిష్ఠంగా 4 నెలల పాటు నిల్వ చేస్తారు. అయితే దీనికి భిన్నంగా శీతాకాలంలో పండే రబీ ఉల్లిలో తక్కువ తేమ ఉంటుంది. అందువల్ల దీనిని కనీసం 6 నెలలు నిల్వ చేస్తారు. రబీ ఉల్లి మార్కెట్‌కు రావడం వేసవి నుంచి శీతాకాలం వరకు మార్కెట్‌కు తీసుకువస్తారు. అయితే మార్కెట్‌లో ధర ఉల్లి నాణ్యతపై ఆధారపడి నిర్ణయం అవుతూ ఉంటుంది.
ఉష్ణోగ్రతలు పెరగడం: మార్కెట్‌లో నిల్వ ఉండే ఉల్లి నాణ్యత.. వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి ధరలను నిర్ణయిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో అది ఉల్లి నాణ్యతపై ప్రభావం చూపించడం ఆరంభించింది. సాధారణంగా రైతులు ఫిబ్రవరిలోనే ఖరీఫ్ పంట విక్రయిస్తూ ఉంటారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఖరీఫ్ అనంతర పంట కూడా రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు.
అధిక తేమ కల్గిన ఈ 2 ఉల్లి రకాలు ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల దెబ్బతింటున్నాయి. వేడి కారణంగా ఇవి త్వరగా ఎండిపోయి కుంచించుకుపోతున్నాయి. అలా ఉల్లి పెద్ద ఎత్తున మార్కెట్‌లను ముంచెత్తుతోంది. ఖరీఫ్, దాని అనంతర ఉల్లి కూడా ఒకే సారి మార్కెట్‌లను ముంచెత్తడంతోనే ధరలు తగ్గిపోతున్నా యని వ్యాపారులు అంటున్నారు. పెరిగే ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత.. ఉల్లి ధర మరింత తగ్గిపోవడానికి కారణం అవుతోందని వ్యాపారులు అంటున్నారు.
ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం ఉల్లి వ్యాపారులకు మాత్రమే కాదు, రైతులకు కూడా కన్నీళ్లు మిగులుస్తోంది. మార్కెట్‌లో నిల్వలు పెరిగి, ధరలు భారీగా తగ్గిపోవడంతో వ్యాపారులు రైతులకు కూడా తక్కువ ధరలే చెల్లిస్తున్నారు. ఇటీవల షోలాపూర్‌లో ఓ రైతు 512 కేజీల ఉల్లిని మార్కెట్‌కు విక్రయం కోసం తీసుకురాగా, అన్ని ఖర్చులూ పోనూ వ్యాపారి రైతుకు కేవలం 2రూపాయల చెక్కు చేతిలో పెట్టాడు. ఇలాంటి అనుభవాలు అనేక మంది రైతులకు ఎదురవుతున్నాయి.
రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుంటున్న దళారులు, వ్యాపారులు:ఎండల కారణంగా ఉల్లి మరింత పాడయ్యే ప్రమాదం ఉండడంతో రైతులు తమ ఇంట్లో నిల్వ ఉన్న పంట ఎంత తక్కువ లాభం వచ్చినా ఫర్వాలేదు అనుకుంటూ మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. అయితే రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుంటున్న దళారులు, వ్యాపారులు ధరలను మరింత తగ్గించి నామమాత్రం మొత్తాన్ని రైతు చేతిలో పెడుతున్నారు. రైతులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధను దిగమింగుకుంటూ వ్యాపారులు ఇచ్చిన మొత్తాన్ని తీసుకుంటున్నారు.
ఉల్లి పంట సాగు ఎప్పుడూ సున్నితమైన అంశమే: ఉల్లి పంట సాగు ఎప్పుడూ సున్నితమైన అంశమే. వాతావరణం, మార్కెటింగ్ సహా అనేక అంశాలు ఉల్లి ధరను నిర్ణయిస్తాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించని సందర్భాలే అనేకం. ఇది ఒక్క భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న సమస్యే. ఉల్లి ధరలు అమాంతం పెరగడం, అంతే అమాంతం తగ్గాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. ద్రవ్యోల్బణం 14ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో అసలు ఎవరి ఊహకు అందని విధంగా అక్కడ కేజీ ఉల్లి ధర రూ.1200లకు చేరింది. అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఏడాదికి ఒకసారి మాత్రమే ఉల్లి పంటను వేసేందుకు అవకాశం ఉండడం కూడా వాటి ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం.
ఫిలిప్పీన్స్‌లో చికెన్, మటన్, పోర్క్ కంటే కూడా ఉల్లి ధరే ఎక్కువగా ఉంది. అక్కడి హోటళ్లు ఉల్లి వాడకాన్ని తగ్గించడమో, నిలిపివేయడమో చేస్తున్నాయి. సాధారణ ప్రజలు సైతం ఉల్లి వాడకాన్ని పూర్తిగా నిలిపి వేస్తున్నారు. ధరల పెరుగుదలతో ఉల్లికి డిమాండ్ కూడా ఎగబాకిన నేపథ్యంలో అక్కడి రైతులు పంట పూర్తిగా ఎదగకముందే దాన్ని కోసి మార్కెట్లకు తీసుకువస్తున్నారు.