Onion Export Ban : దేశంలో ఉల్లి ధరల నియంత్రణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం శుక్రవారం(డిసెంబర్ 8)నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ నిషేధం 2024 మార్చి 31 వరకు కొనసాగనుంది.
అయితే వీటి ఎగుమతుల విషయంలో కొన్ని సడలింపులను కల్పిస్తూ పలు మార్గదర్శాకాలను విడుదల చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT). ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దేశీయంగా ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉంచడమే కాకుండా వాటి ధరలను అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే ఉంది.
ఉల్లి ఎగుమతుల విషయంలో కొన్ని మినహాయింపులు కల్పించింది డీజీఎఫ్టీ. నిషేధానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన సమయం కంటే ముందే ఓడల్లో లోడ్ అయి ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఉల్లిని, అలాగే ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇతర దేశాల అభ్యర్థనలు, అవసరాల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే ఆయా దేశాలకు ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ చెప్పింది.
ఉల్లి ఎగుమతులపై కేంద్రం బ్యాన్ విధించడం వల్ల మహారాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు సీజన్లలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఇతర సంక్షోభాల కారణంగా ఉల్లి పంట చేతికి రాక అక్కడి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలతో మంచి పంట దిగుబడి రావడం వల్ల వాటిని గోదాముల్లో నిల్వ ఉంచారు. అయితే వాటిని ఎగుమతి చేద్దామనేలోపే ప్రభుత్వం ఈ నిషేధం నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉల్లి రైతులు వాపోతున్నారు.
ఆ దేశాలకు బియ్యంపై బ్యాన్ ఎత్తివేత!
భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతయ్యే బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. అయితే ఈ ఎత్తివేత ప్రస్తుతానికి 5 దేశాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. కొమొరోస్, మడగాస్కర్, ఈక్వటోరియల్ గినియా, ఈజిప్ట్, కెన్యా దేశాలకు పలు నిబంధనలతో సోనామసూరీ బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చని చెప్పింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసింది. వాస్తవానికి దేశంలో బియ్యం ధరల తనిఖీ విషయంలో ఆహార భద్రతను నిర్ధరించేందుకు ఈ ఏడాది జూలై 20న బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది ప్రభుత్వం. అంతకుముందు నేపాల్, కామెరూన్, కోట్ డి ఐవోర్, రిపబ్లిక్ ఆఫ్ గినియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సీషెల్స్, యుఏఈ, సింగపూర్ దేశాలపై కూడా ఈ బ్యాన్‌ను ఎత్తివేసింది.
గోధుమ నిల్వ నిబంధనలు మరింత కఠినతరం!
గోధుమ నిల్వలను అరికట్టి, వాటి ధరలను నియంత్రించేందుకు స్టాక్ పరిమితుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది కేంద్రం. దీనికి సంబంధించి శుక్రవారం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు టోకు వ్యాపారులు, రిటైలర్లు, పెద్ద చైన్ రిటైలర్లతో పాటు ప్రాసెసర్లకు వర్తిస్తాయని తెలిపింది. హోల్‌సేల్ వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న స్టాక్ పరిమితిని 2 వేల టన్నుల నుంచి 1000 టన్నులకు తగ్గించారు. ఒక్కో రిటైలర్‌పై 10 టన్నులకు బదులు 5 టన్నులు, పెద్ద చైన్ రిటైలర్లు ఒక్కో డిపోకు 5 టన్నులు, తమ డిపోలన్నింటికీ కలిపి మొత్తం 1000 టన్నుల వరకు స్టాక్ పరిమితి ఉంటుందని బ్రీఫింగ్ మీడియా, ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
అతి చౌకైన ట్రెడ్మిల్- ఇంట్లోనే చెక్కతో తయారు చేసుకోవచ్చట!
టీఎంసీ ఎంపీ మహువాపై బహిష్కరణ వేటు- లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్