మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగాల్ సిలిగుడిలో భాజపా యువ మోర్చా కార్యకర్తల నిరసనల్లో హింస చెలరేగింది. కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం సహా బాష్ఫవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో భాజపా సీనియర్ కార్యకర్త ఉలెన్ రాయ్ ప్రాణాలు కోల్పోయారు.
బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై భాజపా ఎంపీ, యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య తీవ్రంగా మండిపడ్డారు.
"శాంతియుత నిరసనలు చేసిన చాలా మంది భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. బంగాల్లో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. మమత పోలీసులు విసిరిన నాటు బాంబుల వల్ల అయిన గాయాలతోనే భాజపా సీనియర్ కార్యకర్త ఉలెన్ రాయ్ మరణించారు."
-తేజస్వీ సూర్య, భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వంటి సమస్యలకు వ్యతిరేకంగా భాజపా ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. సిలిగుడిలోని రాష్ట్ర సచివాలయ దక్షిణ బంగాల్ యూనిట్ వరకు ర్యాలీగా వెళ్లాలని యత్నించింది.