One Nation One Election Panel:ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సూచనలు కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల నుంచి జనవరి 15 లోపు వచ్చే సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. సూచనలు పంపాలనుకున్న వారు ప్యానెల్ వెబ్సైట్ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదంటే sc-hlc@gov.inకు మెయిల్ చేయాలని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటి వరకూ రెండు సార్లు సమావేశమైంది.
దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతోపాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి ఇప్పటికే జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై ఒకరోజు పరస్పర చర్చను కోరుతూ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ కూడా రాసింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది.
భారత రాజ్యాంగం ఇతర చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్‌వర్క్‌ను కోవింద్ కమిటీ దృష్టిలో పెట్టుకోనుంది. లోక్‌సభ రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకాకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేయడానికి కోవింద్ కమిటీ ఏర్పాటైంది. గత సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ కమిటీ. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పిన ఈ కమిటీ, తాజాగా సూచనలను ఆహ్వానించింది.