One Nation One Election Committee :జమిలి ఎన్నికల నిర్వహణ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పని ప్రారంభించింది. ఈ మేరకు న్యాయ శాఖ ఉన్నతాధికారులు సన్నాహక సమావేశం నిర్వహించి.. కమిటీ ఛైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు.. కమిటీ పనితీరును వివరించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితేన్ చంద్ర, లెజిస్లేటివ్ సెక్రటరీ రీటా వశిష్ట తదితరులు ఆదివారం కోవింద్‌ను కలిశారు.
'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు .. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు.. శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు చోటు కల్పించింది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.
జమిలి ఎన్నికలు అంటే.. రాష్ట్రాలపై దాడి : రాహుల్ గాంధీ
పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై.. కాంగ్రెస్ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఆలోచన దేశం, అందులోని రాష్ట్రాలపై దాడి చేయడమే అని మండిపడింది. ముఖ్యంగా రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరు చూస్తుంటే సిఫార్సులు ఇప్పటికే నిర్ణయించినట్లు అనిపిస్తోందని హస్తం పార్టీ ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అమిత్ షాకు అధీర్ రాసిన లేఖను కూడా ట్యాగ్ చేశారు. ఇండియా అంటే భారత్ అని, రాష్ట్రాల సమాహారమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఒక దేశం-ఒక ఎన్నిక అంటే.. దేశం, అందులోని రాష్ట్రాలపై దాడిగా అభివర్ణిస్తూ.. రాహుల్ ట్వీట్ చేశారు.