Monkeypox cases in India: దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దిల్లీలో నివసిస్తున్న నైజీరియా వాసికి మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవల ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదు. అతడి వయసు 35 అని అధికారులు తెలిపారు. బాధితుడిని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇది దిల్లీలో రెండో కేసు కాగా.. దేశంలో ఆరవది. నైజీరియా వాసికి ఒంటిపై పొక్కులు వచ్చాయని, ఐదు రోజులుగా జ్వరంగా ఉందని అధికారులు వెల్లడించారు. 'అతడి నమూనాలను పుణెలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపించాం. సోమవారం సాయంత్రం ఫలితాలు వచ్చాయి. అందులో పాజిటివ్ అని తేలింది. ఆఫ్రికా దేశస్థులైన మరో ఇద్దరు అనుమానితులను సైతం ఆస్పత్రిలో చేర్పించాం' అని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, జులై 30న ప్రాణాలు కోల్పోయిన 22ఏళ్ల యువకుడికి మంకీపాక్స్ పాజిటివ్ అని నిర్ధరణ అయింది. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన అతడు.. స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాతి రోజే అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. యూఏఈలో ఉన్నప్పుడే అతడికి మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనంతరం అతడి నుంచి సేకరించిన నమూనాలను అధికారులు పరీక్షలకు పంపించగా.. తాజాగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బాధితుడికి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, స్నేహితులను పరిశీలనలో ఉంచారు. మరోవైపు, రాజస్థాన్‌లోనూ మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. ఒంటిపై దురద, జ్వరం వంటి లక్షణాలతో 20ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు.