ఒడిశా కలహండి జిల్లా కర్లాపాత్ అభయారణ్యంలో మరో ఏనుగు మృతి చెందింది. నెల రోజుల వ్యవధిలోనే ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. గజరాజుల మరణానికి పశువుల్లో వ్యాపించే హేమోర్హేజ్ సెప్టీస్కేమియా అనే వ్యాధిగా అధికారులు తెలిపారు. అయితే.. వీటిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల మృతిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశుసంవర్ధక శాఖ అధికారి గణేశ్ పుఝారిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ప్రధాన వెటర్నరీ అధికారి చైతన్య శెట్టి తెలిపారు. సదరు అధికారి ఏనుగులకు వ్యాక్సినేషన్, చికిత్స అందించినట్లు ఎలాంటి రికార్డులు లేవని, జంతువుల ఆరోగ్యంపై నిఘా వేయటంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చెప్పారు.