అనేక విధాలా చతికిలపడిన పార్టీని తిరిగి గాడిన పెట్టడానికి ఉదయ్‌పుర్‌లోని 'చింతన్ శిబిర్'లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా ఎన్నికలను ఎదుర్కోవడం అంత సులభం కాకపోయినా ముందుగా పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నాలపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీ గళాన్ని ప్రసార/ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే కమ్యూనికేషన్స్-పబ్లిసిటీ విభాగానికి బాధ్యుడిగా సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను ఇటీవల నియమించడం దీనిలో భాగమే. దూకుడు కనపరిచే నేతగా పేరొందిన పవన్ ఖేరాను పార్టీ మీడియా విభాగం అధిపతిగా తీసుకున్నారు. తిరిగి ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ గట్టిగా చెబుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేశారు. 50 ఏళ్ల లోపువారే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీల్లో 50% మేర ఉండాలనే నిబంధనా క్షేత్రస్థాయిలో అమలవుతోందని సీనియర్ నేత అజయ్ మాకన్ చెప్పారు. ఉదయ్‌పుర్ తీర్మానాలు కిందిస్థాయి వరకు వెళ్లాయన్నారు.
అమల్లోకి వచ్చిన ఒకే పదవి నిబంధన
తదుపరి సార్వత్రిక ఎన్నికల కోసం నియమించుకున్న టాస్క్‌ఫోర్స్ ఒక వ్యూహాన్ని రూపొందించిన తర్వాత మరిన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఐదేళ్లకు పైగా పదవుల్లో ఉన్నవారిని.. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధన కింద క్రమంగా మార్చబోతున్నట్లు వెల్లడించారు. మీడియా విభాగం అధిపతిగా, కర్ణాటక వ్యవహారాల బాధ్యునిగా ఉన్న రణ్‌దీప్ సుర్జేవాలాతో దీనికి శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేస్తున్నారు. త్వరలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా నిలవనుంది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రమే అధికారంలో ఉండడంతో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కీలకం కానున్నాయి.