One Million Us Visas For India :2023లో పది లక్షల మంది భారతీయులకు వీసాలు జారీ చేస్తామని ప్రకటించిన అమెరికా విదేశాంగ శాఖ.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ ఏడాదిలో భారతీయులకు 10 లక్షల వీసాలను మంజూరు చేసింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా ఎంబసీ ఎక్స్(ట్విట్టర్)లో తెలిపింది.
"10లక్షల మిషన్‌ను సాధించాం. 2023లో ఒక మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలన్న మా లక్ష్యం నెరవేరిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో ఆగకుండా రాబోయే కాలంలో మరింత పురోగతిని సాధిస్తాం. మరింత ఎక్కువ మందికి అమెరికా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాం" అని భారత్‌లోని అమెరికా ఎంబసీ ట్వీట్ చేసింది. దాంతోపాటు యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేసింది.
భారీగా పెట్టుబడులు..
Ten Lakhs Visas To Indians : అమెరికా- భారత్ ప్రజల మధ్య సంబంధాలు గతంలో కంటే బలంగా ఉన్నట్లు యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఇరు దేశాల సంబంధాలను మెరుగుపర్చడంలో సహకారం అందించిన పది లక్షల మంది వీసాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వీసా ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడం కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు.
పదో లక్షవ వీసా హోల్డర్‌కు..
America Visa Price In India :మరోవైపు, దిల్లీలో పదో లక్షవ వీసా హోల్డర్ అయిన రంజూ సింగ్‌తోపాటు పాటు ఆయన సతీమణికి అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి.. వీసాలు అందజేశారు. పదో లక్షవ వీసా అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. రంజూ సింగ్ దంపతులు.. అమెరికాలో చదువుతున్న తమ కుమారుడి దగ్గరకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మీడియాతో మాట్లాడారు.
భవిష్యత్తు కోసం మరింత మెరుగ్గా..
"వీసాల విషయంలో మెరుగ్గా పనిచేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ వంటి పలు నగరాల్లో మరిన్ని అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయాలు ప్రారంభించాం. మా వ్యవస్థల్లో మార్పులు చేసి.. ఎక్కువ మంది వీసాలు మంజూరు చేసేందుకు పనిచేశాం. అందుకు ఫలితంగా 2023లో పది లక్షలు వీసాలు మంజూరు చేయగలిగాం. భవిష్యత్తు కోసం మరింత మెరుగ్గా సన్నద్ధమవ్వాలి" అని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పారు.
గతేడాది అమెరికాలో 1.2 లక్షకుపైగా భారతీయులు సందర్శించారని ఆ దేశ ఎంబసీ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రయాణ సంబంధాల్లో ఒకటిగా వర్ణించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీసా దరఖాస్తుదారుల్లో భారతీయులే 10 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పింది. మునుపెన్నడూ లేనంతగా వీసా ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడానికి సిబ్బందిని విస్తరించినట్లు పేర్కొంది. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో కొత్త కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.