One Hour Police Boy : కర్ణాటకలోని ఓ ఎనిమిదినరేళ్ల బాలుడు.. గంటపాటు పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాక.. సిబ్బంది విధులపై ఆరా తీశాడు. రిజిస్టర్లను పరిశీలించి సంతకం కూడా చేశాడు. అసలు ఈ బాలుడు ఎవరు? ఎందుకు గంటపాటే విధులు నిర్వర్తించాడో తెలుసుకుందాం.
శివమొగ్గలోని ఉరగడూరుకు చెందిన తబ్రేజ్ ఖాన్, నగ్మా దంపతులు రెండో కుమారుడు అజాన్ ఖాన్. పుట్టుకతోనే అతడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పటికే అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా.. ఆ చిన్నారి వ్యాధి నయం కాలేదు. ప్రస్తుతం అతడి కుటుంబం బాలెహోన్నూరులో నివసిస్తోంది. ఇటీవలే తనకు పోలీస్ కావాలని ఉందని అజాన్.. తన తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే అజాన్ తల్లిదండ్రులు శివమొగ్గ జిల్లా సూపరింటెండెంట్ మిథున్ కుమార్‌ను సంప్రదించారు. తమ కుమారుడి పరిస్థితిని వివరించారు.
అజాన్‌కు ఎస్పీ పుష్పగుచ్ఛం అందించి..
అజాన్ పరిస్థితిని అర్థం చేసుకున్న జిల్లా ఎస్పీ మిథున్.. బాలుడి కోరిక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. దొడ్డపేట పోలీస్ స్టేషన్‌లో గంటపాటు పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించేందుకు అవకాశం ఇస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే.. ఒకటో తరగతి చదువుతున్న అజాన్ ఖాన్.. బుధవారం పోలీసుల అధికారిక వాహనంలో స్టేషన్‌కు చేరుకున్నాడు. అజాన్‌కు ఎస్పీ మిథున్‌కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేశారు.