One digital ID: ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్ట్, పాన్.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ (ఐడీలను) అనుసంధానం చేస్తూ కొత్తగా 'ఒకే డిజిటల్ ఐడీ'ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం (ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్)గా ఈ కొత్త మోడల్‌ను రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేసినట్లు సమాచారం.
ఓ వార్తా సంస్థ సమాచారం మేరకు.. కేంద్రం కొత్త ప్రతిపాదనలో భాగంగా ఆధార్ కార్డు నంబరు మాదిరిగా దీనికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండొచ్చని అంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రతిపాదనను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తాన్ని ఒకేచోట ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.