Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. నగరంలోని నేరేడ్‌మెట్, కుత్భుల్లాపూర్, సైదాబాద్, ముషీరాబాద్, వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, భాగ్యలత, ఆటోనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, అనాజ్‌పూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఏకధాటిగా పడిన వర్షం ధాటికి పలుచోట్ల నాలాలు పొంగిపొర్లాయి. రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచి.. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్నిచోట్ల వృక్షాలు విరిగిపడటంతో ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు.
మరోవైపు.. జగిత్యాల పట్టణంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లోనూ అర్ధరాత్రి భారీ ఈదురు గాలులు, ఉరుములతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. భారీ గాలి వానతో రోడ్లపై చెట్లు విరిగి పడటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల పట్టణంలోని ఖిలా గడ్డ, సుతారిపేట్ చౌరస్తా వద్ద పెద్ద వృక్షం గాలి దుమారానికి వేళ్లతో సహా ఊడిపడింది. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం విరిగి కింద పడి పెను ప్రమాదం తప్పింది. పురాణిపేట్ ప్రిన్స్ గార్డెన్ వెళ్లే రహదారి మధ్యలో చెట్టు విరిగి విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. నిజామాబాద్ వెళ్లే రహదారిలో మామిడి మార్కెట్ వద్ద ఉరుములు, మెరుపులతో అరగంట పాటు వాన దంచికొట్టింది. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పాటు కల్లాలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది.
పంటంతా నేల పాలు..: ఆరుగాలం కష్టపడి పంట పండించడం కర్షకులకు ఒక ఎత్తైతే.. పండించిన ఆ పంటను అకాల వర్షాల నుంచి కాపాడుకుని.. విక్రయించడం మరో ఎత్తు అవుతుంది. మెదక్ జిల్లాలోని పలుచోట్ల గత రాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి రవాణాకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది.