Omicron XE Variant in India: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోన్న సమయంలో కొత్త వేరియంట్ 'ఎక్స్‌ఈ' కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్ 'ఎక్స్‌ఈ' కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారికారులు వెల్లడించారు. ఇది ఎక్స్‌ఈ వేరియంటేనని జీనోమ్ సీక్వెన్సింగ్‌లో స్పష్టంగా తెలిసిందని వెల్లడించింది.
ఎక్స్‌ఈ వేరియంట్ సోకిన వ్యక్తి నమూనాలను మొదట గాంధీనగర్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వివరించింది. అక్కడ పాజిటివ్‌గా తేలిన తర్వాత మరోసారి నిర్ధరించుకునేందుకు నమూనాలను కోల్‌కతాలోని ల్యాబ్‌కు పంపామని, అక్కడ కూడా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చెప్పింది. అయితే వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి కొత్త లక్షణాలు లేవని స్పష్టం చేసింది. సదరు వ్యక్తి మార్చి 13న కొవిడ్ బారిన పడ్డారని, ఆ తర్వాత కోలుకున్నాక ముంబయికి వెళ్లారని పేర్కొంది. అయితే ఇతన్ని కలిసిన ముగ్గురికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.