Omicron treatment: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బారినపడిన రోగులకు కేవలం మల్టీ విటమన్ ట్యాబ్లెట్లు, పారాసెటమాల్తోనే చికిత్స అందిస్తున్నట్లు దిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్ సీనియర్ వైద్యులు వెల్లడించారు. వారికి మరే ఇతర ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం రాలేదన్నారు.
ఇప్పటివరకు మొత్తం 40మంది ఒమిక్రాన్‌తో ఈ ఆస్పత్రిలో చేరారు. వీరిలో 19 మంది డిశ్చార్జి కూడా అయ్యారు.
ఒమిక్రాన్ సోకిన వారిలో 90శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు. మిగతా వారికి గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలున్నాయని వివరించారు.
" ఒమిక్రాన్ బారినపడిన వారిలో దాదాపు అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే. ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేయగా వారికి పాజిటివ్‌గా తేలింది. దాదాపు అందరూ రెండు డోసుల టీకా తీసుకున్నారు. ముగ్గురు, నలుగురు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు.'
-ఎల్ఎన్జేపీ సీనియర్ వైద్యులు
Delhi omicron news
దిల్లీలో ఎల్ఎన్జేపీ ఆస్పత్రితో పాటు సర్ గంగారామ్ సిటీ హాస్పిటల్, మ్యాక్స్ హాస్పిటల్ సాకెత్, ఫోర్టిస్ హాస్పిటల్, బత్రా హాస్పిటల్లో ఒమిక్రాన్ అనుమానిత కేసుల కోసం ఐసోలేషన్‌తో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దిల్లీలో మొత్త 67 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 23మంది కోలుకున్నారు.
దిల్లీలో రోజుకు లక్ష కేసులొచ్చినా చికిత్స అందించేలా వైద్యపరమైన ఏర్పాట్లు చేసినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నందున ఇంట్లోనే చికిత్స అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రోజుకు మూడు లక్షల కరోనా టెస్టులు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:బూస్టర్ డోసు అవసరమేనా? కేంద్రం ఏం చేయనుంది?