Omicron Transmission vs Delta: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. అందువల్ల మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలన్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా రకం కేసులు కూడా ఇంకా నమోదవుతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ సమయానుకూలంగా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరాన్ని బట్టి నైట్ కర్ఫ్యూలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు వంటి చర్యలను లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్ పరికరాలు, ఔషధాలు వంటి వైద్య సంబంధమైన సౌకర్యాల మెరుగుదలకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని సూచించారు. 100శాతం వ్యాక్సినేషన్ కవరేజీని వేగవంతం చేయాలన్నారు.
Omicron Cases in India