Health ministry: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేసింది కేంద్రం. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో.. చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు గుమికూడటం, అనవసర ప్రయాణాలు చేయడం వంటివి మానుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.
పలు దేశాల్లో వైరస్ నాలుగో ఉద్ధృతి మొదలైందని అన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. ఈ నేపథ్యంలోనే భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంకా పోరాడాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ఒమిక్రాన్.. డెల్టా కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. ప్రపంచవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 6.1 శాతం ఉందని చెప్పారు.
ఒమిక్రాన్ కేసులు ఒకటిన్నరు నుంచి 3 రోజుల్లోపే రెట్టింపు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
''ఐరోపా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కొవిడ్ కేసులు వారం వారం బాగా పెరిగిపోతున్నాయి. కానీ ఆసియా దేశాల్లో ఇప్పటికీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. ఇంకా పోరాడాల్సిందే.''
- రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
India Omicron Cases:
దేశంలో నమోదైన 358 ఒమిక్రాన్ కేసుల్లో ఇప్పటివరకు 183 విశ్లేషించినట్లు.. వీటిలో 121 మంది విదేశాల నుంచి వచ్చినట్లు తెలిపారు రాజేశ్ భూషణ్. ఈ 183 కేసుల్లో 91 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని, ఇందులో ముగ్గురు బూస్టర్ డోసులు కూడా పొందారని పేర్కొన్నారు. 70 శాతం బాధితుల్లో లక్షణాలు లేవని అన్నారు. 114 మంది కోలుకున్నారని వెల్లడించారు.
కరోనా నిబంధనలను పాటించడం సహా అందరూ వ్యాక్సిన్ తీసుకోవడమే వైరస్ నియంత్రణకు మార్గమని స్పష్టం చేశారు రాజేశ్ భూషణ్.
కేరళ, మిజోరంలో కొవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
''కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్, కర్ణాటకలో ప్రస్తుతం వరుసగా కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో అర్హులైన వయోజనుల్లో 89 శాతం మంది ప్రజలు టీకా మొదటి డోసు తీసుకున్నారు. 61 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు.''
- రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
బూస్టర్ డోసుపై..
ప్రజలకు బూస్టర్ డోసు అందించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు ఐసీఎంఆర్ డీజీ డా. బలరాం భార్గవ. ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించేందుకు సైంటిఫిక్ డేటాను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్ పనితీరును కూడా పరీక్షిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం ఆదేశాలు- రాష్ట్రాల్లో ఆంక్షలు..
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గురువారం సూచించింది.