కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (B.1.1.529) ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. 2021 నవంబర్ 24న సౌతాఫ్రికాలో తొలుత ఈ తరహా కేసు బయటపడింది. వెంటనే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది అక్కడి ప్రభుత్వం.
2 రోజులకే దీనిని ఆందోళనకర వైరస్ వేరియంట్‌గా (వేరియంట్ ఆఫ్ కన్సర్న్) ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. క్రమక్రమంగా ఆఫ్రికా దేశాలు సహా మొత్తంగా ఇప్పటివరకు 29 దేశాలను చుట్టేసిందీ వైరస్. అమెరికాలో తొలి కేసు డిసెంబర్ 1న నమోదైంది. తాజాగా భారత్‌కూ వ్యాపించింది.
Omicron Cases in India:
భారత్‌లో ఎన్ని కేసులు? ఎక్కడ?
భారత్‌లో 2 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు డిసెంబర్ 2న(గురువారం) ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 11, 20 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో 46, 66 ఏళ్ల వయసు వారిలో ఈ వైరస్ బయటపడిందని స్పష్టం చేసింది. రెండు ఒమిక్రాన్ కేసుల్లో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా దేశస్థుడని, మరొక వ్యక్తి ప్రభుత్వ వైద్యుడని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణాఫ్రియా వ్యక్తికి 66 ఏళ్లుకాగా, కర్ణాటక ప్రభుత్వ వైద్యుడికి 46 ఏళ్లు. దక్షిణాఫ్రికా దేశస్థుడు కోలుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. మంత్రితో సమావేశమై కొత్త వేరియంట్ వ్యాప్తి కట్టడిపై చర్చించారు
Omicron Virus Symptoms:
లక్షణాలు ఎలా ఉన్నాయి?
భారత్‌లో వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసుల్లో.. తీవ్ర లక్షణాలు కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
వైరస్ నిర్ధరణ అయిన ఇద్దరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.
లక్షణాలు లేకుంటే కూడా భయపడాల్సిందేనా?
ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల్లో పెద్దగా లక్షణాలు కనిపించట్లేదు. ఇది భయపడాల్సిన అంశమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే ప్రజలు నిర్ధరణ పరీక్షలకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు.
తమకు కొవిడ్ సోకిందనే విషయాన్నే కొందరు గుర్తించలేరు. డెల్టా రకంలో కనిపించినట్లు.. కొన్ని వేరియంట్ల వల్ల రోగి శరీరంలో వైరస్ అధికస్థాయిలో ఉండొచ్చు. అది ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి నుంచి అంత అధికంగా ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి రకాల వల్ల ఇన్‌ఫెక్షన్ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు.
Omicron Dangerous than Delta:
డెల్టా కంటే ప్రమాదకరమా?
భారత్‌లో కరోనా రెండో దశకు కారణమైన డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమైనది ఓ అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ తీవ్రత ఎలా?
కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2 రకాల్లో అత్యధిక మ్యుటేషన్లు ఒమిక్రాన్‌లో ఉన్నట్లు తేలింది.
ఒమిక్రాన్‌లో మొత్తంగా 50కిపైగా ఉత్పరివర్తనాలు ఉన్నాయి. కేవలం స్పైక్ ప్రొటీన్లోనే 32 మ్యుటేషన్లు ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఇది డెల్టా కంటే కూడా ఎక్కువే.
ఇన్ని మ్యుటేషన్లు ఉన్నప్పుడు.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
Omicron Vaccine Efficacy:
టీకాలు పనిచేస్తున్నాయా?
డెల్టా స్ట్రెయిన్ సహా సార్స్-కోవ్-2పై ప్రస్తుత వ్యాక్సిన్లు అత్యంత ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కేంద్రం ఏ చర్యలు తీసుకుంటోంది?
కేసులు వచ్చినప్పటికీ భయాందోళనకు గురికావొద్దని, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ ప్రమాదఘంటికలు మోగినప్పటినుంచే.. భారత్ అప్రమత్తమైంది. దేశంలో కరోనా నిబంధనలను డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
- కొత్త వేరియంట్‌ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని నవంబర్ 28నే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ.
- నవంబర్ 30న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ భేటీ.