Omicron India News: దేశానికి కరోనా కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ నియంత్రణ కోసం విస్త్రతంగా సన్నద్ధమవ్వాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలని స్పష్టం చేసింది.
వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు శనివారం లేఖ రాశారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టాలని, కొవిడ్ నమూనాలను వేగంగా ల్యాబ్‌లకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వైరస్ కట్టడికి ప్రజలు.. నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ కేసులు బయటపడిన దేశాలను ముప్పు ప్రాంతాలుగా గుర్తించామని, అక్కడి నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై మరిన్ని నిబంధనలు విధించే అవకాశముందని లేఖలో భూషణ్ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని, కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు టెస్టింగ్‌ను ఉద్ధృతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
'ఫ్లైట్లు నిలిపివేయండి...'
ఒమిక్రాన్‌పై సర్వత్రా భయాందోళనలు నెలకొన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే విమానాలను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు(omicron india).