Omicron India: దిల్లీలో మొత్తం 10 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూసినట్లు ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. ఈ వైరస్ సోకిన వారిలో ఒక్కరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మిగతా వారు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వివరించారు. ఎవరిలోనూ తీవ్ర లక్షణాలు కనిపించలేదన్నారు.
లోక్‌నాయక్ ఆస్పత్రిలో మొత్తం 40 మంది కరోనా అనుమానితులు ప్రత్యేక వసతులతో ఐసోలేషన్లో ఉన్నట్లు జైన్ వెల్లడించారు. వీరిలో 38మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన 10మందిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వివరించారు. అంతర్జాతీయ పర్యటకులే బాధితులుగా ఉంటున్నారని పేర్కొన్నారు.
Karnataka omicron
కర్ణాటకలో గురువారం ఒక్కరోజే 4 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. బ్రిటన్, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, దిల్లీ నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది.
Gujarat omicron cases
గుజరాత్లో గురువారం మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. మెహ్సానా జిల్లా విజాపుర్ గ్రామానికి చెందిన ఆరోగ్య కార్యకర్తకు పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. బాధితురాలికి వాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈమె విదేశాల్లో పర్యటించలేదని, కానీ జింబాబ్వే నుంచి వచ్చిన బంధువును కలిసిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 10న ఈమెకు పాజిటివ్ రాగా.. శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్ పంపగా.. గురువారం ఒమిక్రాన్ వేరియంట్ అని తేలింది.
ఆరోగ్య కార్యకర్త భర్త ఇటీవలే మరణించారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు అతని సోదరి, బావ జింబాబ్వే నుంచి వచ్చారు. అయితే కరోనా పరీక్షలో వారికి నెగెటివ్ వచ్చింది.